బీచ్‌ వద్ద స్కూల్ బస్సు బీభత్సం: ఒకరు మృతి, 8మందికి గాయాలు(వీడియో)

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: నగరంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బీచ్‌ పక్కనే ఉన్న చిల్డ్రన్స్‌ పార్కులోకి అదుపుతప్పి ఓ స్కూలు బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 8మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం రాత్రి సరిగ్గా 8.30 గంటల ప్రాంతంలో నోవోటెల్‌ హోటల్‌ వైపు డౌన్‌ నుంచి శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌ పాఠశాల బస్సు అదుపు తప్పి నేరుగా సాగరతీరం వైపు వరుణ్‌ బీచ్‌ గోడ మీదుగా దూసుకెళ్లి సాగరానికి సుమారు 100 అడుగుల దూరంలో ఆగింది. బీచ్‌రోడ్‌లో నడుస్తున్నవారు, రహదారి గోడపై కూర్చొని కబుర్లు చెబుతున్నవారు, సాగర అందాలు తిలకిస్తున్నవారితో పాటు పార్కు చేసిన ద్విచక్రవాహనాలపై నుంచి బస్సు దూసుకెళ్లింది. దీంతో ఒక్కసారిగా ఏమవుతుందో తెలియని భయానక వాతావరణం ఏర్పడింది.

అదుపు తప్పిన బస్సును చూసి భయపడిన సందర్శకులు పరుగులు తీశారు. బీచ్‌ ప్రాంతం క్షతగాత్రుల ఆర్తనాదాలు మిన్నంటాయి. తేరుకున్న స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను సెవెన్‌హిల్స్‌, కేజీహెచ్‌ ఆసుపత్రులకు తరలించారు. బస్సు మీద నుంచి దూసుకెళ్లడంతో కాళ్లు, మిగిలిన శరీర భాగం విడిపోయి వరుణ్‌ బీచ్‌లో పడటంతో కొద్ది నిమిషాల వ్యవధిలోనే దూసి ధర్మారావు (60) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.

ప్రమాద ఘటనలో చనిపోయిన దూసి ధర్మారావు కుమారుడు కిషోర్‌ స్పెషల్‌ ఇంటిలిజెన్స్‌ బ్యూరో అదనపు ఎస్పీ కాగా ఈయన కూడా తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్లు విరిగాయి. ఈయన కుమారుడు దేవగురు, కుమార్తె మంజీర కూడా గాయాలపాలయ్యారు. వీరితో పాటు తాడేపల్లిగూడెం గ్రామానికి చెందిన పైడిపాల అన్నపూర్ణ, పైడిపాల వేణుగోపాలరావు, దేవరాజరెడ్డి పద్మావతి, ప్రసాదరావు, పైడిపాల సునీత, వెంకటప్రకాష్‌, గాజువాకకు చెందిన శ్రీకర్‌, వ్యాన్‌ డ్రైవర్‌ కృష్ణ తదితరులు గాయపడ్డారు. పోలిస్‌ కమిషనర్‌ యోగానంద్‌ సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితి సమీక్షించారు.

కాగా, బస్సు అదుపుతప్పడానికి గల కారణాలు తెలియలేదని పోలీసు కమిషనర్‌ యోగానంద్‌ సంఘటన స్థలంలో పేర్కొన్నారు. అయితే, ప్రమాద ఘటనకు సమీపంలోని ఒక హోటల్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఒక వేడుకకు ఇదే బస్సులో విద్యార్థులను తీసుకువచ్చారు. కాగా, ప్రమాద సమయంలో విద్యార్థులెవరూ ఈ బస్సులో లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An outing to the city’s famous Ramakrishna Beach turned out to be tragic for a family, when one of its members died on the spot and three others from the same family sustained injuries in a freak accident on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి