అనంతపురంలో దారుణం-భారీ పేలుడులో తునాతునకలైన వాచ్ మన్ బాడీ...
అనంతపురంలో ఇవాళ ఒళ్లు గగుర్పొడిచే దారుణమైన ఘటన చోటు చేసుకుంది. స్ధానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఆకస్మికంగా సంభవించిన పేలుడులో స్ధానికంగా నివాసం ఉంటున్న ఓ వాచ్ మెన్ చనిపోయాడు. అంతే కాదు ఈ పేలుడు ధాటికి ఆ వాచ్ మెన్ శరీరం ముక్కలు ముక్కలైంది. దీంతో స్ధానికంగా భీతావహ పరిస్ధితులు నెలకొన్నాయి.
అనంతపురం ఆర్టీవో కార్యాలయం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ పేలుడు చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఉలిక్కి పడ్డారు. స్ధానికంగా ఓ కెమికల్ డబ్బా తెరుస్తుండగా ఈ పేలుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి స్ధానిక అపార్టుమెంట్ వాచ్‌మెన్ సతీష్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ పేలుడుతో అనంతపురం నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

ఆర్టీవో కార్యాలయం సమీపంలో శ్రీ బాలాజీ స్టిక్కర్స్ స్ప్రే పెయింట్స్ షాపు ఉంది. ఇక్కడ కొంతకాలంగా ఓ గోడౌన్ ఏర్పాటు చేసి స్ప్రే అమ్మకాలతో పాటు పెయింటింగ్ పనులు కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ కొన్ని రోజులుగా వాడని పెయింట్ డబ్బాలు ఉన్నాయి. వాటిని సమీపంలో ఉన్న అపార్టుమెంట్ వాచ్‌మెన్‌కు అమ్ముకోమని షాపు యజమాని చెప్పడంతో సదరు వాచ్ మెన్ వాటిని తెరిచేందుకు ప్రయత్నించాడు.
పెయింట్ డబ్బాలు తెరిచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో అవి ఒక్కసారిగా పేలిపోవడంతో వాచ్ మెన్ సతీష్ అక్కడికక్కడే చనిపోయాడు. పేలుడు తీవ్రత ఏ స్ధాయిలో ఉందంటే దాని ధాటికి సతీష్ శరీరం ముక్కలు ముక్కలై ఎగిరిపడింది. దీంతో ఆర్డీవో కార్యాలయం చుట్టుపక్కల భయానక వాతావరణం ఏర్పడింది. ఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని షాపు యజమానిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications