జనసేనలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. ఈ రెండు పేర్లేనా??
అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ప్రతి రాజకీయ పార్టీకి ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలచేత, ప్రజల కొరకు ఏర్పాటయ్యే ప్రభుత్వాలకు ఆధారం రాజకీయ పార్టీలు. వాటిని ప్రజలు ఆమోదిస్తేనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతాయి. అవి ప్రజలచేత ఆమోదింపబడాలంటే ముందుగా తమ పార్టీలో ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం ముఖ్యం. నేతలుండాలి.. నాయకులుండాలి.. కార్యకర్తలుండాలి. కానీ పవన్ కల్యాణ్ నేతృత్వంలో సాగుతున్న జనసేనలో పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్ అనే రెండుపేర్లే వినపడుతున్నాయని, ఇతరులకు ఎందుకు అవకాశం లభించడంలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

ప్రజారాజ్యం అనుభవాలు చూసి..
తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పవన్ కల్యాణ్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నేతలందరికీ బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నప్పటికీ మరోవైపు ఎవరైనా అవకతవకలకు పాల్పడతారేమోనన్న అనుమానం ఉంది. నిజాయితీతో పరిపాలన సాగించాలనుకుంటున్న పవన్‌కు ఇప్పుడు ఈ ఆలోచనే పార్టీ అడ్డంకికి అడ్డుగా మారింది. తన సొంత ఆదాయం నుంచే కౌలు రైతులకు నష్టపరిహారం కింద చెల్లిస్తూ భరోసా యాత్ర చేస్తున్న వపన్ తనపార్టీలోని నేతలు, నాయకులు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నారు.

రాష్ట్రస్థాయి నేతలు లేరా?
జనసేనలో పవన్, నాదెండ్ల మనోహర్ పేర్లే వినపడతాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఇతరుల పేర్లు వినపడతాయి. ఆ తర్వాత ఎవరిపేరు వినపడదు. కారణం.. ఎవరినీ పదవుల్లో నియమించకపోవడం.. బాధ్యతలు అప్పగించకపోవడం. జిల్లాలవారీగా నేతలకు బాధ్యతలు అప్పగించకపోవడంవల్ల క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కావడంలదేనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా కార్యక్రమం నిర్వహించాలంటే పవన్ కల్యాణ్ రావాలి... లేదంటే నాదెండ్ల మనోహర్ రావాలి. ఇంతకుమించి మూడో నేతగా ఎవరి పేరు వినపడటంలేదు.

బలోపేతం చేయాలంటే ఎలా?
ఎప్పుడు కావాలంటే అప్పుడు పవన్ అందుబాటులో ఉంటూ, తాను ఎదగడంతోపాటు, పార్టీని బలోపేతం చేస్తూ, నేతలను ఎదగనిస్తుంటే జనసేన ప్రజల్లోకి వెళుతుందని, క్షేత్రస్థాయిలో బలోపేతమవుతుందనే భావన ఆ పార్టీ నాయకుల్లోనే వ్యక్తమవుతోంది. ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాల సమయమే ఉంది.
గత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు కొల్లగొట్టింది. ప్రస్తుతం వాటిపైనే దృష్టిపెట్టాలనే యోచనలో ఉంటే ప్రాంతీయ పార్టీ నుంచి ఉప ప్రాంతీయ పార్టీగా మారిపోతుందని, అలా కాకుండా పార్టీలో నియామకాలను విస్త్రతం చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లడంద్వారానే బలపడుతుందని, అప్పుడే నాయకులు పుట్టుకొస్తారని విశ్లేషకులు జనసేనానికి సూచిస్తున్నారు. అయితే పవన్ ఏ తరహా నిర్ణయాలు తీసుకొని జనసేనను బలోపేతం చేస్తారో చూద్దాం..!!












Click it and Unblock the Notifications