విజయ్ కు అసలు పరీక్ష: మే 13 లేదా ఆలోపే
తమిళనాడు రాజకీయాల్లో నేడు నవశకం మొదలు కాబోతోంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్.. ఇంకాస్సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. బీజేపీ, ఏఐఏడీఎంకేలను అధికారానికి దూరంగా ఉంచాలనే ధ్యేయంతో చిన్న పార్టీలతో దీర్ఘకాల చర్చల తర్వాత ఈ ప్రభుత్వం కొలువుదీరింది.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో వైభవంగా జరగనుంది. నటుడిగా ప్రవేశించి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు పరంపరను కొనసాగిస్తోన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు గెలిచి టీవీకే రికార్డు సృష్టించారు. 234 మంది సభ్యుల అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్‌కు లభించింది. అసెంబ్లీలో మెజారిటీ మార్కు 118.

కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల నుంచి లభించిన మద్దతు లభించింది. ఆయా పార్టీలు అందించిన లేఖలను గవర్నర్ కు సమర్పించారు. దీంతో నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌ను నియమిస్తూ శనివారం తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో మే 13, లేదా ఆలోగా అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్షల్లో నెగ్గాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ ఫ్లోర్ టెస్ట్.. విజయ్ కు అసలు పరీక్ష. మెజారిటీ మార్క్ కు ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బలపరీక్ష ముగిసేంత వరకూ వారందరినీ కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడున్న 120 మందితో కూడిన అలయన్స్ ప్రభుత్వాన్ని అయిదేళ్ల పాటు విజయ్ ఎలా నడిపించగలడనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో అడుగు పెట్టిన విజయ్ కు ఇదొక సవాల్ గా మారుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు. వీటిలో ఒక స్థానానికి రాజీనామా చేయనున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ ను ఆయన ఖాళీ చెయ్యొచ్చు. ఆయన ఖాళీ చేసిన నియోజకవర్గాన్ని ఖచ్చితంగా గెలిచి తీరాల్సి ఉంటుంది ఇప్పుడున్న సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే. అది ఓడిపోతే మెజారిటీ మార్క్ మరింత తగ్గుతుంది. ఓటమి ప్రభావంతో ప్రతిపక్షాలు బలపడతాయి. వారి స్వరం మరింత గట్టిగా వినిపిస్తుంది.












Click it and Unblock the Notifications