మహా కూటమి కట్టిన టీడీపీ: జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కాకుండా.. బిగ్ ప్లాన్
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ మహా కూటమి కట్టింది. వైసీపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకొని వెళ్లాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి బీజేపీ-జనసేన మినహా మిగిలినవన్నీ తెలుగుదేశానికి జై కొట్టాయి. భవిష్యత్‌లో బీజేపీ-జనసేన పార్టీలతోనూ ఈ కూటమిలో భాగస్వామ్యం కల్పించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.

పాల్గొన్నది వీరే..
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించింది. విజయవాడలోని హోటల్ ఐలాపురం దీనికి వేదిక. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఈ భేటీని ఏర్పాటు చేసింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం - ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట నిర్వహించిన ఈ భేటీలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణ, శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకుడు కందుల దుర్గేశ్, కాంగ్రెస్ తరఫున నరసింహారావు, జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.

ఉమ్మడి వ్యూహాలు..
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం సాగుతోందని, దీన్ని సమష్టిగా అడ్డుకోవాల్సిన బాధ్యత వైసీపీయేతర పార్టీలపై ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ విజయం సాధించకుండా ఉండటానికి ఉమ్మడి వ్యూహాలను రూపొందించాలని, దాన్ని పక్కాగా అమలు చేయాల్సి ఉంటుందని అభిప్రాపడ్డారు.

సీజేఐ దృష్టికి..
రాష్ట్ర పర్యటనకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు నిర్ణయించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. రాజ్యాంగం, చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, దీన్ని సీజేఐకి వివరించాలని చెప్పారు. ఆయా అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందించాలని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు.

వైసీపీని గద్దె దించడానికి కలిసి పని చేయాలి..
వైఎస్ఆర్సీపీని గద్దె దించడానికి ఉమ్మడి పోరాటాలకు శ్రీకారం చుట్టాలని అఖిలపక్ష నాయకులు చెప్పారు. మరోసారి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరిస్తే- ప్రజా సంఘాలకు కనీసం స్వేచ్ఛ కూడా ఉండదని, అఖిలపక్ష భేటీలను నిర్వహించుకునే పరిస్థితి కూడా ఉండబోదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే- దాడులకు దిగుతోందని వారు ఆరోపించారు.

గడప గడపకు దగా..
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఓడించే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకే ఉన్నాయని జడ శ్రావణ్ కుమార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఓటర్లల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, వారే ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని చెప్పారు. జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా గడప గడపకు దగా పేరిట త్వరలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలను చేపట్టనున్నట్లు వివరించారు. దీనికి వైసీపీయేతర పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

మాతో కలవండి..
ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్.. పవన్ కల్యాణ్‌కు కీలక సూచనలు చేశారు. తమ కూటమితో కలిసి రావాలని అన్నారు. మతవాద పార్టీతో పొత్తు పెట్టుకోవద్దని సలహా ఇచ్చారు. అది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని శ్రావణ్ కుమార్ హితబోధ చేశారు. జనసేన పార్టీ- మతవాద పార్టీతో పొత్తు పెట్టుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఒక్క ఛాన్స్ ఇస్తే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్క చాన్స్ అంటూ ప్రజలను మభ్య పెట్టారని, వైసీపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారని అచ్చెన్నాయుడు అన్నారు. ఆ నమ్మకాన్ని జగన్ పోగొట్టుకున్నారని, వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారికి రాత్రికి రాత్రి అరెస్టు చేయిస్తోన్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు తమపై పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, ప్రజల కోసం తమ పోరాటాన్ని ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications