టీ మంత్రిని అరెస్టు చేయాలి: ఓయులో ఉద్రిక్తం, పరిగిలో..
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మంగళవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉస్మానియా విద్యార్థులు ఆర్ట్స్ కళాశాల నుంచి తార్నాకకు ర్యాలీ నిర్వహించారు. మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
పెద్ద ఎత్తున విద్యార్థులు తార్నాక వైపుకు ర్యాలీగా వచ్చారు. వీరిని పోలీసులు తార్నాకలో అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘర్షణ వాతావరణం కనిపించింది.

మరోవైపు రంగారెడ్డి జిల్లా పరిగిలోను విద్యార్థులు రోడ్డెక్కారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవ్దని, విద్యార్థులను నిరుద్యోగులుగా చేయవద్దని వారు నినాదాలు చేశారు.
కాగా, సోమవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావును విద్యార్థులు అడ్డుకోవడంతో ఆయన పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. కేటీఅర్ ఆంధ్ర మహిళా సభ కళాశాలలో పుస్తక విక్రయ కేంద్రం ప్రారంభోత్సవానికి వస్తున్నారనే విషయం తెలిసుకొన్న విద్యార్థులు ఆవరణలో బైఠాయించారు. ముఖ్యమంత్రికి, మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులను పోలీసులు బలవతంగా అరెస్టు చేశారు. ఉద్రిక్తల నేపథ్యంలో కేటీఆర్ తన పర్యటన రద్దు చేసుకున్నారు.
సచివాలయంలో మళ్లీ ఆందోళన
సచివాలయ ఉద్యోగులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. సచివాలయంలో ఉమ్మడిగా ఉన్న లైబ్రరీ, రీడింగ్ రూములను ఏపీ ప్రభుత్వం ఖాళీ చేయమనడం వివాదానికి దారి తీసింది. సచివాలయంలోని రీడింగ్, లైబ్రరీ గదులను ఏపీ ఇంధన శాఖకు, ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రటరీకి కేటాయిస్తూ ఏపీ సర్కార్ జీవో జారిచేసింది. ఏపీ సర్కార్ తన ఆదేశాలను వెంటనే విరమించుకోవాలని టి సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.












Click it and Unblock the Notifications