గిడ్డి ఈశ్వరి ముద్దు -రమేష్ నాయుడు వద్దు: పాడేరు టీడీపీలో ఆగని రచ్చ!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో విజయం సాధించాలని టిడిపి జనసేన బీజేపీ కూటమి తమ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా అభ్యర్థుల ప్రకటన తెలుగుదేశం పార్టీలో ఆందోళనలకు కారణంగా మారింది. ఇప్పటికే పలువురు చంద్రబాబు నిర్ణయం పట్ల తీవ్ర అసహనంతో టిడిపికి గుడ్ బై చెప్పి బయటకు వెళ్తుంటే, మరికొందరు పార్టీలోనే ఆందోళన పర్వానికి శ్రీకారం చుట్టారు.
తాజాగా పాడేరు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థి, సీనియర్ రాజకీయ నాయకురాలు అయిన ఈశ్వరిని పక్కనపెట్టి కిల్లు వెంకట రమేష్ నాయుడుని పోటీకి దించింది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం మరో మారు టిక్కెట్ కేటాయించే విషయంలో పునరాలోచన చేసి అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి. ఈశ్వరికి టిక్కెట్ ఇచ్చి న్యాయం చెయ్యాలని,అన్యాయం చెయ్యవద్దంటూ ఆందోళనల పర్వం కొనసాగిస్తున్నారు.

గిడ్డి ఈశ్వరి ముద్దు -రమేష్ నాయుడు వద్దు అనే నినాదంతో పాడేరు పట్టణ పురవీదుల్లో ఈశ్వరి మద్దతుదారులు 5మండలాల నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి భారీ ఎత్తున చేరుకొని నినాదాలతో ర్యాలీ చేస్తూ హోరెత్తించారు.ముందుగా 5మండలాల అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీలు, కార్యకర్తలు, మహిళలు కుమ్మరి పుట్టు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ గిడ్డి ఈశ్వరి నివాసానికి చేరుకున్నారు.
అక్కడ నుండి భారీ ర్యాలీలో ఆర్ టి సి కాంప్లెక్స్ మెయిన్ రోడ్డు మీదుగా అంబేద్కర్ కూడలి నుండి మెయిన్ బజారు మీదుగా పాడేరు పట్టణ పురవీధుల్లో పెద్దఎత్తున నినాదాలతో ర్యాలీ చేశారు. ఇప్పటికే ఇటు నిరాకరించడం తెలుగుదేశం పార్టీ చేసిన ద్రోహంగా పేర్కొన్న దిడ్డి ఈశ్వరి, తాను ఎన్నికల బరిలోకి దిగుతానని ప్రకటించారు.
మరోవైపు ఆమె మద్దతుదారులు ఎట్టి పరిస్థితులలోనూ రమేష్ నాయుడుని గెలవనివ్వమని, ఆయనను ఓడించి తీరుతామని అల్టిమేటం జారీ చేస్తున్నారు. ఇప్పటికైనా అధినేత చంద్రబాబు పాడేరు అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని, దిడ్డి ఈశ్వరికి టికెట్ ను కేటాయించి ఎన్నికల బరిలో నిలపాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications