ఏపీకి ప్రత్యేక హోదా ఫైట్: 'జగన్ నోరు విప్పడం లేదేం'
హైదరాబాద్: ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ప్రత్యేక హోదా పైన టిడిపి మాట్లాడటం లేదని వైసిపి, జగన్ మాటెత్తడం లేదని టిడిపిలు కొన్నాళ్లుగా మండిపడుతున్న విషయం తెలిసిందే.
తాజాగా, మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన మంగళవారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జగన్‌ను దృతరాష్ట్రుడిగా, సైంధవుడిగా అభివర్ణించారు. జగన్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

జగన్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమర్శించే అర్హత లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా గురించి నోరు విప్పకుండా జగన్ దృతరాష్ట్రుడిలా వ్యవహరిస్తున్నారన్నారు. సాగు నీటి ప్రాజెక్టుల పాలిట సైంధవుడిలా మారిపోయారన్నారు.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కొంతమంది నేతలు వారి స్వార్థం కోసం ఉద్యమాలు, ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం ఐక్యంగా పోరాడాలన్నారు.












Click it and Unblock the Notifications