మీడియా ప్రశ్నలు: రేవంత్ రెడ్డి అరెస్టుపై ఎపి మంత్రి పల్లె ఉక్కిరిబిక్కిరి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారంపై మీడియా ప్రతినిధులు ఉక్కిరిబిక్కిరి చేశారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలను పల్లె రఘునాథ రెడ్డి దాటవేయడానికి ప్రయత్నించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన విషయం కాదని దాటవేశారు.
సోమవారం మంత్రి వర్గం సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం కురిపించారు. పునర్విభజన బిల్లులో హెడ్ క్వార్టర్ అనే పదానికి సరైన అర్థం తెలియజేయలేదని ఆయన విమర్శించారు.

గవర్నర్ అధికారాలను సరి చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆస్తులను సరిగా పంచాలని మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు మంత్రి తెలిపారు. విభజన నష్టాలను సమిష్టిగా పూడుద్దామని ఆయన అన్నారు. తమ నవ నిర్మాణ దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు.
యేటా పది నుంచి 12 శాతం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధి సాధించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. డ్వాక్రా మహిళలకు పది వేల రూపాయలేసి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి అరెస్టు వ్యవహారం చర్చకు వచ్చినట్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు టిఆర్ఎస్‌పై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications