బాబుపై మాటలా, మీ నాన్నకే లేదు, నీకెప్పుడు రావాలి: కెటిఆర్‌పై పల్లె
హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఎన్ని సెక్షన్లు, షెడ్యూళ్లు, పేజీలు ఉన్నాయో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి తెలుసా అని ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. చట్టం గురించి తెలియకపోయినా ఏపీ మంత్రులకు అవగాహన లేదని వ్యాఖ్యానించడం కడియం శ్రీహరి అహంకారానికి నిదర్శమన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత కెటిఆర్ నాన్నకే లేదని, కెటిఆర్‌కు ఎప్పుడు లేదని ఆయన వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ భిక్షతో ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయినవారు నేడు నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటు అని ఆయన అన్నారు. ఈమేరకు మంత్రి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తిన్నింటి వాసాలు లెక్కించడం, తల్లిపాలు తాగి రొమ్ముగుద్దటం తెలంగాణ మంత్రులకు అలవాటుగా మారిందన్నారు.

పదవీవ్యామోహంతో తల్లిలాంటి పార్టీని విడిచిపెట్టిన కడియం ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ గుండె చప్పుడు అయితే దానికి రక్తాన్ని సరఫరా చేసింది సీమాంధ్ర ప్రజలు అని గుర్తుంచుకోవాలన్నారు. కడియంలాంటి చేతగాని, అసమర్థ మంత్రులు దొరకడం తెలంగాణ దురదృష్టమని ఆక్షేపించారు.
సెక్షన్-8 చట్టబద్ధం కాకపోతే సెక్షన్-3కు ఎలాంటి చట్టబద్ధత ఉంటుందో వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్న కడియంకు మతి ఉందా అని ఎద్దేవా చేశారు. ఆంధ్రా ప్రజలపట్ల పాకిస్తాన్ కంటే ఘోరంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా నేర్చుకోని కేటీఆర్ చంద్రబాబుపై విమర్శలు మానుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications