వినుకొండలో దారుణం: రెండు చేతులు నరికి యువకుడి హత్య
పల్నాడు జిల్లాలోని వినుకొండ చెక్ పోస్టు సెంటర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి.. రషీద్ అనే యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో రషీద్ రెండు చేతులు తెగిపోయాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు.
ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి రషీద్ మద్యం షాపులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జిలానీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు.

తీవ్రంగా గాయపడిన రషీద్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయారు. పాత కక్షల కారణంగానే రషీద్‌ను జిలానీ హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా, షేక్ రషీద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా, నిందితుడు జిలానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా సమాచారం. ఇరుపార్టీలకు సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగిన ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
అచ్యుతాపురం: కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి కార్మికుడు మృతి
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలటంతో ఓ కార్మికుడికి తీవ్ర గాయాలపాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే సీఐ నరసింగరావు ఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. మృతుడిని ఒడిశాకు చెందిన ప్రదీప్‌రౌత్(44)గా గుర్తించారు.
ప్రమాదం జరిగే సమయానికి ప్రదీప్ రౌత్ శుభ్రం చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. రియాక్టర్ పక్కనే ఉండటంతో ప్రమాదంలో మృతి చెందాడు. కార్మికుడి మృతిపై కుటుంబ సభ్యులకు కంపెనీ యాజమాన్యం సమాచారం అందించింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసు అధికారులు విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications