మోడీకి దేశమే కుటుంబం: పరుచూరి, తపనతోనే పవన్..
గుంటూరు/కడప: ప్రముఖ సినీ, మాటల రచయిత, నటుడు పరుచూరి వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీకి తన మద్దతును ప్రకటించారు. వారసత్వం, కుటుంబ బాంధవ్యాలు లేకుండా భారతదేశమే తన కుటుంబంగా భావిస్తుండటంతోనే.. నరేంద్ర మోడీకి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఆదివారం పరుచూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సినీ జీవితాన్ని సైతం పక్కన పెట్టి మోడీ మద్దతిస్తుండటం దేశానికి, రాష్ట్రానికి ఏదో మంచి జరగాలనే తపనతోనేనని ఆయన పేర్కొన్నారు. మోడీ ప్రధాని అయితే తమ జీవితాలు బాగుపడుతాయని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు.

మోడీ సునామీని ఎవరూ ఆపలేరు: పురంధేశ్వరి
కడప: తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ రూపంలో వస్తున్న బిజెపి సునామీని ఆపే శక్తి ఎవరకీ లేదని ఆ పార్టీ నేత, రాజంపేట లోకసభ అభ్యర్థిని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఆదివారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిజెపి, తెలుగుదేశం పార్టీల పొత్తు చరిత్రాత్మక అవసరమని తెలిపారు. తన సోదరుడు, హిందూపురం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ అవసరమున్న చోట్ల ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్పిన పురంధేశ్వరి, తనకు తన కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications