ఏపీ ఎన్నికల్లో భారీ అక్రమాలు ? అర్ధరాత్రి 3500 బూత్ లలో ? పరకాల మరో సంచలనం..!
ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్న సామాజిక వేత్త, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ (Parakala Prabhakar) తాజాగా మరో సంచలనం రేపారు. పోలింగ్ చోటు చోటు చేసుకున్న అక్రమాలను గణాంకాలతో సహా బయటపెట్టారు. ముఖ్యంగా ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా జరిగిన భారీ పోలింగ్ తో పాటు ఓటు నమోదుకు పట్టిన సమయం వంటి వివరాలను ఆయన ఢిల్లీలో తాజాగా వెల్లడించారు.
రాష్ట్రంలో గత ఎన్నికల్లో పోలింగ్ రోజు అర్ధరాత్రి తర్వాత అసాధారణ రీతిలో దాదాపు 17 లక్షల ఓట్లు నమోదయ్యాయని, ముఖ్యంగా ఆరు సెకన్లలోపే ప్రతీ ఓటూ పోలైనట్లు పరకాల ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు 3,500 బూత్‌లలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ కొనసాగిందని ఆయన వెల్లడించారు. రాత్రి 11.45 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య మొత్తం ఓట్లలో సుమారు 4.16% పోలయ్యాయని, ఈ గణాంకాలు ఆందోళనకరమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయని ప్రభాకర్ పేర్కొన్నారు.

రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల మధ్య దాదాపు 52 లక్షల ఓట్లు నమోదయ్యాయని పరకాల తెలిపారు. కేవలం అర్ధరాత్రి తర్వాతే 17 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయన్నారు. అర్ధరాత్రి తర్వాత ప్రతి 20 సెకన్లకు ఒక ఓటు పోలవడం అత్యంత ఆశ్చర్యకరమైన విషయమన్నారు. ఈవీఎంలు రీసెట్ అవ్వడానికి 14 సెకన్లు పడుతుంటే, అంత తక్కువ సమయంలో ఓట్లు ఎలా పోలయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ సమయంలో ఒక ఓటరు వాస్తవంగా లోపలికి వెళ్లి, ఓటు వేసి, బయటకు రావడం సాధ్యమేనా?" అని ప్రభాకర్ ప్రశ్నించారు. రాత్రి 8 గంటల తర్వాత "ఏదో అసాధారణమైనది" జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి 175 సీట్లకు గానూ 164 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కేవలం టీడీపీ 135 సీట్లు గెల్చుకుంది. జనసేనకు 21, బీజేపీకి 8 సీట్లు దక్కాయి. ఈ ఎన్నికలపై విపక్ష వైసీపీ ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఓటింగ్ శాతం గణాంకాలపై కోర్టుకు కూడా వెళ్లింది. 2024 మే 13న సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ప్రధానాధికారి 68.04% ఓట్లు పోలయ్యాయని ప్రకటించారు, రాత్రి 8 గంటలకు ఈసీ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఓటింగ్ శాతం 68.12%గా ఉందని తెలిపింది. రాత్రి 11.45 గంటలకు ఈసీ ఓటింగ్ శాతాన్ని 76.50%కి సవరించింది. నాలుగు రోజుల తర్వాత విడుదల చేసిన తుది ఓటింగ్ శాతం 81.79%గా ఉంది.












Click it and Unblock the Notifications