చెవిరెడ్డి తండ్రికి పింఛనా: జగన్‌కు పరకాల సూటి ప్రశ్న
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్ బుధవారం మండిపడ్డారు. జగన్ ఆక్రోశం అవినీతి కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్య రెడ్డి పేరిట తెల్ల రేషన్ కార్డు ఉందని, ఆయనకు వృద్ధాప్య పింఛనూ వస్తోందని, ఆర్థికంగా స్థితిమంతుడైన ఓ ఎమ్మెల్యే తండ్రి పేదలకు దక్కాల్సిన పింఛను పొందడాన్ని జగన్ సమర్థిస్తారా అని ప్రశ్నించారు.
ఇంతకాలం సుబ్రహ్మణ్యం రెడ్డి పేరుతో మంజూరవుతూ వచ్చిన సొమ్ము ఎవరు తీసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా గత పదేళ్లలో ఎన్ని అక్రమాలు జరిగాయని, ఎంతమంది పేదల సొమ్మి మింగారని ప్రశ్నించారు. చంద్రబాబు తనిఖీల పేరిట పంఛన్లను కోసేస్తున్నారంటూ జగన్ రాసిన బహిరంగ లేఖ పైన పరకాల తీవ్రంగా స్పందించారు.

ఎమ్మెల్యే తండ్రి లాంటి అనర్హులను ఏరివేయడానికే ప్రభుత్వం భారీ ఎత్తున తనిఖీలు చేపట్టిందన్నారు. దీనికి జగన్ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో చెప్పాలన్నారు. నిజమైన అర్హులకు మాత్రమే ప్రభుత్వ ప్రయోజనం దక్కాలన్న ఉద్దేశ్యంతో తనిఖీలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను కాగ్ ఎత్తి చూపిందన్నారు. ఆ తప్పులను సరిదిద్దాలను తాము చూస్తున్నాన్నారు.
చీపురుపల్లిలో 38 ఏళ్ల మహిళ వృద్ధాప్య పింఛన్ తీసుకోవడాన్ని జగన్ సమర్థిస్తారా చెప్పాలన్నారు. పింఛన్ పెంచుతానని చెప్పి 2004లో అధికారంలోకి వచ్చిన వైయస్.. 2005లో కేవలం రూ.25 పెంచి వంద రూపాయలు చేశారని, 2007లో కేంద్రం పింఛన్ మొత్తాన్ని రూ.400 చేశాక దానిని రూ.200 చొప్పున విడగొట్టి ఇద్దరికీ పంచిన ఘనత జగన్ తండ్రికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
సొంత మీడియాలో ఎంత దుష్ప్రచారం చేసినా జనం నమ్మరనేది మొన్నటి ఎన్నికల ఫలితాలే రుజువు చేశాయన్నారు. ఆదర్శ రైతుల ముసుగులో ఉన్న కాంగ్రెసు కార్యకర్తలను తొలగిస్తే జగన్ మండిపటాన్ని చూస్తే ఆయన ఆక్రోశం అవినీతి కోసమే తప్ప పేదల కోసం కాదని అర్థమవుతోందన్నారు.












Click it and Unblock the Notifications