టిడిపి అభ్యర్థులపై దాడి, 'జగన్' అభ్యర్థి కొడుకు హల్‌చల్
కడప: మైదుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు బుధవారం దాడికి పాల్పడ్డారు. కడప జిల్లాలోని జె కొత్తపల్లిలో సుధాకర్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుధాకర్ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. జమ్మలమడుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామసుబ్బా రెడ్డి పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు గొరిగనూరులో దాడికి పాల్పడ్డారు. తన పైన దాడిని నిరసిస్తూ రామసుబ్బా రెడ్డి రోడ్డు పైన బైఠాయించారు.
శ్రీకాకుళం జిల్లాలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కేంద్రమంత్రి పళ్లం రాజు కాకినాడలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తాను అభివృద్ధి చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న విభజన వ్యతిరేక సెంటిమెంట్‌ను కొంత పోగొట్టానని చెప్పారు. తాను తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు. కాగా, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉందని అందరు అభిప్రాయపడుతున్న విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లా రాయదుర్గంలో తెలుగుదేసం పార్టీ నేత దీపక్ రెడ్డిని పోలీసులు గృహ ననిర్బంధంలో ఉంచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు రాప్తాడు టిడిపి అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా వెంకటాపురంలో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
తిరుపతిలో జగన్ పార్టీ అభ్యర్థి హల్‌చల్
చిత్తూరు జిల్లా తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి కరుణాకర్ రెడ్డి తనయుడు హల్ చల్ చేశారు. తిరుపతిలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద అతను తన అనుచరులతో కలిసి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications