ఛీ! దసరా రోజు కూడా రాక్షసుడు జగన్ పేరు తేవాల్సి వస్తోంది: పరిటాల సునీత నిప్పులు
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి పరిటాల సునీత గురువారం నిప్పులు చెరిగారు. పసుపు - కుంకుమ పథకాన్ని హేళన చేయడం జగన్ రాక్షసత్వానికి పరాకాష్ట అన్నారు.

జగన్ రాక్షసుడు, రాక్షస కృత్యాలు అలవాటు
పసుపు కుంకుమ పథకంపై జగన్ విమర్శలు చేశారు. ఇందుకు సునీత కౌంటర్ ఇచ్చారు. డ్వాక్రా పథకాల అమలు తీరుపై తాను చర్చకు సిద్ధమని, అందుకు జగన్ సిద్ధమేనా అని సవాల్ చేశారు. కోటి మంది డ్వాక్రా మహిళలను అవమానించారన్నారు. జగన్ ఓ రాక్షసుడనీ, రాక్షస కృత్యాలు చేయటం, రాక్షస భాషను మాట్లాడటంలో ఆయనను మించినవారు లేరని దుమ్మెత్తి పోశారు.

అసలు సిసలు మహిషాసురుడు జగన్
అంతకుముందు, జగన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మహిషాసుడితో పోల్చారు. దీనిపై కూడా సునీత తీవ్రంగానే స్పందించారు. అసలు సిసలు మహిషాసురుడు జగనేనని, అందుకే 2014 ఎన్నికల్లో రాష్ట్ర మహిళలు మహిషాసుర మర్దన చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ జగనాసురుడిని మర్దించేందుకు రాష్ట్ర మహిళలు మరోసారి సిద్ధమవుతున్నారన్నారు.

దసరా రోజు కూడా జగన్ వంటి రాక్షసుడి ప్రస్తావన
ఎంతో పవిత్రమైన విజయదశమి పర్వదినాన జగన్ లాంటి రాక్షసుడి ప్రస్తావన తేవాల్సి వచ్చిందని సునీత అన్నారు. పసుపు కుంకుమ పథకం తుది విడత నిధులను సైతం విడుదల చేశామన్నారు. మరో పది రోజుల్లో మహిళల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో డ్వాక్రా మహిళలకు కేవలం రూ.276 కోట్లు మాత్రమే నిధులిచ్చి, చంద్రబాబు హయాంలో రూ.11,180 కోట్లు ఇవ్వడాన్ని జగన్ జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.

చంద్రబాబుపై జగన్ విమర్శలు
కాగా అంతకుముందు రోజు, జగన్.. చంద్రబాబుపై విమర్శలు చేశారు. రాక్షసుడు మహిషాసురుడికి చంద్రబాబుకు పోలికలు ఉన్నాయని అన్నారు. రాక్షసుడు మహిషాసురుడు అయితే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నారాసురుడు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన మహిషాసురుడి పాలనలా ఉందని, ఆయన ఎక్కడ అడుగుపెడితే అక్కడ కరవుకాటకాలే అన్నారు. పొదుపు సంఘాలకు ఒక్క రూపాయి కూడా రుణ మాఫీ చేయలేదని, రుణమాఫీ పేరిట మహిళలను దగా చేశారన్నారు. మోసం చేస్తున్న చంద్రబాబును నారాసురుడు అనాలా లేక 420 అనాలా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications