
బాలకృష్ణ 'లయన్'ను చూసిన సునీత, సీబీఐ పాత్ర ఎందుకంటే..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు పరిటాల సునీత ప్రసాద్ ల్యాబ్స్‌లో సినిమా చూశారు. ఆమె తన తనయుడు పరిటాల శ్రీరామ్, ఇతరులతో కలిసి హిందూపురం శాసన సభ్యుడు, టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన లయన్ చిత్రాన్ని చూశారు.

హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించారు. పరిటాల సునీత, శ్రీరామ్‌తో పాటు సినిమా వీక్షించిన వారిలో నిర్మాత రమణా రావు, చమన్ తదితరులు ఉన్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
కాగా, లయన్ సినిమా గత వారం విడుదలైన విషయం తెలిసిందే. గురువారం విడుదలైంది. ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలో మాత్రం జస్ట్ ఓకే అనిపించుకుంటుందని చెబుతున్నారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో మూడు రోజుల క్రితం బాలకృష్ణ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.

తాను లక్ష్మీ నరసింహ స్వామి భక్తుడిని అని, అలాగే తనకు సింహా, లయన్, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు వంటి టైటిల్స్ కలిసి వస్తున్నాయని చెప్పారు. తన తనయుడు మోక్షజ్ఞను 2017లో పరిచయం చేసే ఉద్దేశ్యం ఉన్నట్లు చెప్పారు.
గత మూడు నాలుగేళ్లుగా తెలుగు రాష్ట్రాలకు సీబీఐ బాగా సుపరిచతం అయిందన్నారు. మిగతా రాష్ట్రాల కంటే సీబీఐ మనకు బాగా తెలుసునని, అందుకే ఈ చిత్రంలో ఆ పాత్ర అయితే జనాల్లోకి వెళ్తుందని భావించామన్నారు. అయితే, ఇందులో రాజకీయ ఉద్దేశ్యం లేదని చెప్పారు.