తెరాసలో పరకాల వేడి: ఎమ్మెల్యే టెన్షన్, రేసులో కొండా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో సీట్ల లొల్లి ముదురుతోంది. తొలి జాబితాలో తమ నాయకుడి పేరు లేకపోవడాన్ని నిరసిస్తూ పరకాల సిటింగ్ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి అనుచరులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఆదివారం తెలంగాణ భవన్ ఎదుట ధర్నాకు దిగారు.
కెసిఆర్ జిందాబాద్... మొలుగూరి బిక్షపతి నాయకత్వం వర్థిల్లాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ భవన్‌కు వచ్చిన భిక్షపతితో పాటు తెరాస నాయకులు వచ్చి నచ్చచెప్పడంతో ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా భిక్షపతి విలేకరులతో మాట్లాడారు.

టికెట్ ఇవ్వకపోయినా పార్టీని వీడనని స్పష్టం చేశారు. కెసిఆర్ తనకు తండ్రిలాంటి వారని, న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు. తనకు వ్యతిరేకంగా తప్పుడు సర్వే నివేదిక కెసిఆర్‌కు అందిందని, అందువల్లే టికెట్ నిరాకరించినట్లు సమాచారం ఉందని చెప్పారు. తొలి జాబితాలో సిటింగ్ ఎమ్మెల్యేలందరి పేరుండి, తన పేరు లేకపోవడంతో బాధనిపించిందన్నారు.
ఆ మరుసటి రోజే కెసిఆర్‌ను కలవడానికి ప్రయత్నించానని, ఆదివారం సమాచారం ఇస్తే కలుస్తానని పార్టీ అధినేత బదులిచ్చారని చెప్పారు. కొండా దంపతుల రాకతో పార్టీలో బలం పెరిగిందని ఆయన తెలిపారు. ఆదివారం సాయంత్రం కెసిఆర్‌ను భిక్షపతి కలిశారు. నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థులు చేసిన అసత్య ప్రచారాన్ని కెసిఆర్‌కు ఈ సందర్భంగా భిక్షపతి వివరించారు.
కాగా, పరకాల సీటు కెసిఆర్ తనకే ఇస్తారని నమ్మకం ఉందని భిక్షపతి అన్నారు. కాగా, పరకాల స్థానం ప్రముఖ న్యాయవాది సహోదర్ రెడ్డికి లేదా కొండా మురళీకి కేటాయించే అవకాశముందని ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications