అమరావతా? భ్రమరావతా?, అందుకే జగన్ రానని చెప్పాడు: పార్థసారథి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించేది అమరావతా? లేక భ్రమరావతా అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి పార్థసారథి శుక్రవారం నాడు మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని చెప్పారు. మంత్రులు జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు.
చంద్రబాబు కట్టే రాజధానికి తాము వ్యతిరేకమని చెప్పారు. ఆయన కడుతోంది అమరావతో లేక భ్రమరావతో అర్థం కావడం లేదన్నారు. తాత్కాలిక నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. జగన్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదో చెప్పాలన్నారు. తాత్కాలిక నిర్మాణాలతోనే కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఏపీ మంత్రులు జగన్ పైన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు.

జగన్ అడిగిన ప్రశ్నలకు తొలుత మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, నిరుపేదల బాధలు పట్టించుకోకుండా చంద్రబాబు రాజధాని నిర్మాణానికి ముందుకెళ్తున్నారని, అందుకే జగన్ హాజరు కావడం లేదన్నారు. అదే సమయంలో మీ దోపిడీలో భాగస్వామ్యం కావొద్దనే జగన్ రావట్లేదన్నారు.
చంద్రబాబు నిర్మించే రాజధానితో ప్రజలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూనే రూ.400 కోట్లు శంకుస్థాపనకు చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, టిడిపి నేతలు, మంత్రులు రాజధాని శంకుస్థాపన ఖర్చు పైన నేరుగా సమాధానం చెప్పకుండా జగన్ పైన మాటలతో ఎదురు దాడికి దిగుతున్నారని వైసిపి ఆరోపిస్తోంది.
భూతద్దంలో చూపిస్తున్నారు: నారాయణ
రాజధాని అమరావతి శంకుస్థాపన ఖర్చును విపక్షాలు భూతద్దంలో చూపిస్తున్నాయని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఈ నెల 19వ తేదీ నాటికి రాజధాని శంకుస్థాపన ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. తక్కువ ఖర్చుతో రాజధాని శంకుస్థాపన కార్యక్రమం నిర్మిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications