రఘువీరా 'మేఘమధనం'పై విచారణ: పత్తిపాటి, జగన్ అజెండా అదే: కామినేని
హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ కోరుతూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య, సీఎం చంద్రబాబులపై కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టడాన్ని మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ఆ పార్టీని పట్టించుకోరనే ఇలా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌కు ఇంకా బుద్ధి రాలేదని, అందుకే వాళ్ళకు ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలు చేశారన్నారు. సిగ్గు లేకుండా వారు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోయారనుని అప్పుడే ఆందోళనలు మొదలు పెట్టారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు.
ప్రధాని మోడీ, వెంకయ్య, చంద్రబాబులపై కేసులు పెట్టే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరుపుతంటే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. రఘవీరారెడ్డి మేఘమధనం పేరుతో రూ. 120 కోట్ల కుంభకోణం చేశారని, దానిపై విచారణం చేయబోతున్నట్టు వెల్లడించారు.
ఈ స్కాంపై విచారణను సీబీఐకి ఇవ్వాలా? లేక సీఐడీకి ఇవ్వాలా? అనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని పేర్కొన్నారు. ఇక రాజధాని రైతులను ఒప్పించి మిగతా 1607 ఎకరాలను తీసుకుంటామన్నారు.

జగన్‌పై మంత్రి కామినేని
తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలనే అసెంబ్లీలో వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ప్రస్తావిస్తున్నారని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ బంధాన్ని విడగొట్టడమే జగన్ అజెండా అంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో పూర్తి స్థాయి వైద్యసేవలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. డెంగీ, ఇతర విష జ్వరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి సమీక్షించారు.












Click it and Unblock the Notifications