కావాలనే చేస్తున్నారు: రాజధానిపై పత్తిపాటి, తిట్టిపోస్తున్నారు: జగన్
గుంటూరు/కడప: రాజధాని ప్రాంత రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పత్తిపాటి పుల్లారావు వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి ఆదివారం మండిపడ్డారు. నవ్యాంధ్ర రాజధాని భూమిపూజ జూన్ 6న నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. భూమి పూజకు మందడం - తాళ్లాయపాలెం వద్ద స్థలం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. దసరా నాటికి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని, ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామన్నారు.
కొందరు కావాలనే రాజధాని ప్రాంత రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ప్రజలు అపోహ పడవద్దన్నారు. రాజధాని ఇష్టంలేని వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు.

భూములు ఇచ్చే రైతులకు స్థానికంగానే స్థలాలు ఇస్తామని చెప్పారు. జిల్లాకొక వృత్తి కళాశాల తీసుకు రావాలనే యోచనలో ఉన్నట్లు చెప్పారు. కొన్ని పీపీపీ, మరికొన్ని ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. 8వ తేదీన ప్రభుత్వ వార్షిక వేడుకలు ఘనంగా చేస్తామన్నారు. ఏ కాలంలోను పశుగ్రాసంకు కొరత లేకుండా చూస్తామన్నారు.
చంద్రబాబుపై జగన్ ధ్వజం
చంద్రబాబును మహిళలు, యువకులు తిట్టిపోస్తన్నారని వైసీపీ అధినేత జగన్ వేరుగా మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం అని చెప్పన బాబు ఇప్పుడు దాని గురించి మాట్లాడటం లేదన్నారు. కడప జిల్లా లింగాల మండలం బోనాలలో రైతు గంగాధర్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. గంగాధర్ చనిపోయి మూడు నెలలు అవుతున్నా అతడి కుటుంబానికి ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి సాయం అందించలేదన్నారు. తాను పరామర్శించేందుకు వెళ్తున్నానంటే హడావుడిగా నామమాత్రం సాయం చేస్తారన్నారు. రూ.రెండువేల నిరుద్యోగ భృతి అన్న చంద్రబాబు నోట ఆ మాట ఇప్పుడు రావడం లేదన్నారు.












Click it and Unblock the Notifications