చంద్రబాబుకు పవన్ పరీక్ష, బీజేపీ ఎంట్రీ వేళ - సీఎం జగన్ కు కావాల్సింది అదే..!!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ కల్యాణ్ లక్ష్యం. గతం కంటే భిన్నంగా ఈ సారి ముందస్తుగానే ప్రజా క్షేత్రంలోకి వచ్చారు. పొత్తులు ఖాయమని గతంలోనే పవన్ స్పష్టం చేసారు. ఒంటరిగా వెళ్తానా..పొత్తులతోనా అనేది స్పష్టం కాలేదని తాజా సభలో చెప్పుకొచ్చారు. సీఎం పదవి ఇస్తే తీసుకుంటానని చెప్పారు. పవన్ సహకారంతో అధికారంలోకి రావాలనేది చంద్రబాబు వ్యూహం. కానీ, పవన్ వ్యూహాత్మకంగానే పొత్తు వేళ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చే క్రమంలోనే ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
టీడీపీ..జనసేన పొత్తు వేళ : టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లుగానే పవన్ నడుచుకుంటున్నారని వైసీపీ నేతలు పదే పదే ఆరోపిస్తున్నారు. పవన్ ది ఫక్తు లాలూచీ ప్రయాణం అని విమర్శిస్తున్నారు. సీఎం జగన్ లక్ష్యంగా పవన్ కొంత కాలంగా రాజకీయం చేస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు రానున్న ఎన్నికలు పార్టీకే కాదు..వ్యక్తిగతంగా ప్రతిష్ఠాత్మకం.

నవ్ ఆర్ నెవర్ అని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎలాంటి రిస్క్ తీసుకోవటానికి సిద్దంగా లేరు, అందులో భాగంగానే పవన్ కల్యాణ్ తో పొత్తుకు సిద్దమయ్యారు. బీజేపీతో చర్చలు సాగుతున్నా..క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమని రెండు పార్టీల నేతలు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ ఇదే విషయాన్ని పార్టీ శ్రేణులకు..ప్రజలకు అర్దమయ్యేలా వివరించి చెప్పారు.
పవన్ వ్యూహాత్మకమేనా : పవన్ ఇప్పుడు ఎన్నికల సంసిద్దతలో భాగంగా వారాహి యాత్ర ద్వారా ప్రజల మధ్యకు వస్తున్నారు. కత్తిపూడి సభలో మరోసారి పొత్తులపై అస్పష్టంగా మాట్లాడారు. గతంలో సీఎం పదవి రేసులో తాను లేనని స్పష్టంగా చెప్పిన పవన్ ఇప్పుడు ఇస్తే సీఎం పదవి తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. తాను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్నారని..ఈ సారి ఎవరు అడ్డుకుంటారో చూస్తానని పవన్ సవాల్ చేసారు.
జనసేనను చూసి వైసీపీ భయపడుతోందని పవన్ చెప్పుకొచ్చారు. ఇక..టీడీపీతో పొత్తు ఖాయమైనా పవన్ పొత్తుల పైన ఒక్కో సభలో ఒక్కో విధంగా చెప్పటం పైన టీడీపీతో పాటుగా జనసేనలోనూ చర్చ జరుగుతోంది. పవన్ కల్యాన్ పొత్తుల విషయంలో చేస్తున్న వ్యాఖ్యల వెనుక టీడీపీ పైన ఒత్తిడి పెంచే వ్యూహం ఉందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబుకు పరీక్షగా : ఇప్పుడు బీజేపీ ఏపీలో వైసీపీ వ్యతిరేక స్టాండ్ తీసుకుంది. ఇప్పటి వరకు బీజేపీ తీరు టీడీపీకి అనుకూలంగా మారే సంకేతాలే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లే పరిస్థితుల్లో బీజేపీ ఒత్తిడికి లొంగి తనకు ప్రాధాన్యత తగ్గకుండా పవన్ ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో బీజేపీ కంటే జనసేనతోనే చంద్రబాబు పొత్తు ముఖ్యం.
ఈ సమయం మరింత ఒత్తిడి పెంచి తన మాట నెగ్గించుకొనే వ్యూహాలు ప్రారంభించినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీతో పొత్తు ఖరారైతే ఈ రెండు పార్టీలకు సీట్ల మొదలు అన్ని విషయానల్లోనూ టీడీపీ సమ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రతీ విషయం సున్నితంగా మారుతోంది. ప్రతీ సీటు కీలకంగా మారుతన్న సమయంలో పవన్ వ్యూహాలు..బీజేపీ అడుగులు..వీటికి అనుగుణంగా చంద్రబాబు నిర్ణయాలు...తమకు కలిసి వస్తాయని..సీఎం జగన్ కు అనుకూలంగా మారుతాయనే అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు.












Click it and Unblock the Notifications