గుడివాడలో పవన్ కల్యాణ్ వార్నింగ్ - దమ్ముంటే..!!
ఏపీలో ఎన్నికల సమరం హోరా హోరీగా మారుతోంది. కూటమికి చెందిన ముఖ్య నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల పై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. వైసీపీలోని కొందరు నేతలను ఓడించి తీరాలని టీడీపీ నేతల లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నిక ఆసక్తిని పెంచుతోంది. ఇక్కడ పోటీ హోరా హోరీగా మారింది. ఈ సమయంలో ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
గుడివాడలో పవన్
గుడివాడలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అక్కడ కొడాలి నాని తన గెలుపు పైన ధీమాగా ఉన్నారు. కొడాలి నాని పైన పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ది వెనిగళ్ల రాముకు మద్దతుగా జనసేనాని పవన్ ప్రచారం చేసారు. ముఖ్యమంత్రి జగన్, కొడాలి నాని లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. దమ్ముంటే నా సినిమాలు ఆపితే ఆపుకో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని.. వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో దీపమే అని ఆయన అన్నారు.

సినిమాలు ఆపుకోండి
స్థానిక అంశాల పైన పవన్ స్పందించారు. ఎవరైనా చెరువులు తవ్విస్తారు.. కానీ వీళ్లు కబ్జా చేశారన్నారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలన్నారు. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ ను చూసి, వైకాపా నాయకులను చూసి భయపడాలా అని ప్రశ్నించారు. జగన్ అంటే తనకు భయం లేదని చెప్పారు.
చంద్రబాబుకు అండగా నిలుస్తా
మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం.. మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ.. వెనక్కి తీసుకోకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరమేమొచ్చిందంటూ జగన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల రూ. కోట్లున్నా నిష్ర్పయోజనమే అని ఆయన అన్నారు. చంద్రబాబు బలమైన నాయకుడని , జైలులో ఉన్నా కూడా ఆయన ఏ మాత్రం తొణకలేదన్నారు. అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు.












Click it and Unblock the Notifications