ఏపీలోని ఆ జిల్లాల్లో ఉగ్ర కదలికలు ? సీఎస్, డీజీపీకి పవన్ లేఖలు..!
కేంద్రం పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ఏపీలోని విజయనగరంలో ఉగ్ర కదలికలు కలకలం రేపాయి. విజయనగరానికి చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి వారు ఐసిస్ ఆదేశాలతో బాంబులు తయారు చేసినట్లు గుర్తించారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఈ ఘటనపై స్పందించారు. సీఎస్, డీజీపీలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. ఇందులో పలు కీలక అంశాల్ని పవన్ ప్రస్తావించారు.
జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉగ్రవాద కదలికలు, వారి సానుభూతిపరుల జాడలపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ రాష్ట్ర సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ గుప్తాల్ని కోరారు. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, డీజీపీకి లేఖలు రాశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన తరుణం వచ్చిందనీ, దీనిపై సంబంధిత శాఖలతో సమన్వయం అవసరమని ఇందులో తెలిపారు.

విజయనగరంలో ఒక యువకుడికి ఐసిస్ తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని తెలుగు రాష్ట్రాల నిఘా వర్గాలు గుర్తించి అరెస్టు చేసిన క్రమంలో మన రాష్ట్ర పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించాలని పవన్ కోరారు. ఉగ్రవాద సానుభూతిపరులు, స్లీపర్ సెల్స్, అక్రమ వలసదారులు, రోహింగ్యాల ఉనికిపై, అలాంటివారి కదలికలపైనా అన్ని జిల్లాల అధికారులు తక్షణం అప్రమత్తమై, ఎక్కడైనా ఉగ్ర నీడలు, వారి జాడలు కనిపిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యంగా తీర ప్రాంత జిల్లాల పరిధిలో ఈ తరహా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీఎస్, డీజీపీల్ని పవన్ కోరారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది. కాబట్టి తీర ప్రాంత నిఘా, తీర ప్రాంత రక్షణపై ప్రత్యేక దృష్టి అవసరం అని ఆ లేఖలో పేర్కొన్నారు. పహల్గాం ఉగ్ర దాడులు, తదనంతర పరిణామాలతో దేశ అంతర్గత భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకునే విషయంలో రాష్ట్రంలోని అక్రమ వలసదారులు, ఉగ్రవాద సానుభూతిపరులపై ఇప్పటి వరకూ ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని అనుసరించి మరింత లోతుగా విచారణ చేపట్టాలని కోరారు.

గతంలో రాష్ట్రంలో ఏవైనా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై పూర్తి స్థాయి అప్రమత్తత అవసరం అని.. ఉత్తరాంధ్ర, గోదావరి, మన్యం జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని పవన్ సూచించారు. స్లీపర్ సెల్స్, తీవ్రవాద సానుభూతిపరుల ఉనికిని గుర్తించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచి తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని తెలిపారు.
ఈ లేఖల్లో రోహింగ్యాలపైనా పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. గుంటూరుతోపాటు ఇతర జిల్లాల్లోనూ రోహింగ్యాల ఉనికిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. వీరిలో కొందరికి రేషన్, ఆధార్, ఓటర్ కార్డులు ఉన్నాయనే సమాచారం వస్తోందని, ఇది ఆందోళనకర పరిణామం అన్నారు. అనుమానితుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ మొదలైన గుర్తింపు పత్రాలు కలిగి ఉన్నారా? లేదా? అనుమానిత వ్యక్తులు ప్రభుత్వ శాఖల నుంచి ఐడీ కార్డులు, ధ్రువపత్రాలు పొంది ఉంటే వాటిని ఎలా పొందారు? వారికి ఆశ్రయం ఎవరు ఇచ్చారు? స్థానికంగా వారికి ఎవరు సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారికి సహకరిస్తున్న వ్యక్తులు, సంస్థల గుర్తింపు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలన్నారు.
జాతీయ భద్రత, ప్రజల భద్రతను అత్యంత ప్రాధాన్యంతాంశంగా పరిగణించి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నేళ్ళ కిందట గుంటూరు, గతేడాది రాయలసీమ ప్రాంతాల్లో ఎన్.ఐ.ఏ. దాడులు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకొందన్నారు. ఈ విషయాన్నీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మన పోలీసులు గమనంలోకి తీసుకోవాలని సూచించారు. దేశ భద్రత, రక్షణ అనేవి ఈ తరుణంలో అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్నవని, పోలీసులు శాంతిభద్రతలతోపాటు అంతర్గత భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తే కేంద్ర ప్రభుత్వ చర్యలకి రాష్ట్రం సహకారం తోడవుతుందన్నారు.












Click it and Unblock the Notifications