Pawan Kalyan : జనసేనలో నాగబాబుకు ప్రమోషన్ ఇచ్చిన పవన్ కళ్యాణ్...
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోబోతున్న వేళ జనసేన పార్టీని సంస్ధాగతంగా బలోపేతం చేసేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రెండు కీలక నియామకాలు చేపట్టారు. ఇందులో తన సోదరుడు కొణిదెల నాగబాబుకు ప్రమోషన్ ఇవ్వగా.. పార్టీకి ఇన్నాళ్లుగా పరోక్షంగా సేవలందిస్తున్న మరో నాయకుడికి జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించారు.

కొణిదెల నాగబాబు ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ బ్యాడ్జ్ ను అన్నకు అందించారు.

దీంతో పాటు విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయపరుస్తారని తెలుస్తోంది. ఎన్నారైల సేవలను పార్టీకి సమర్ధవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు అందిస్తారు. అదే విధంగా నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు, గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పరోక్షంగా సేవలందిస్తున్న వేములపాటి అజయ కుమార్ కి పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య వ్యవహారాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ అప్పగించారు. ఆయనకు జాతీయ మీడియాకు పార్టీ తరపున అధికార ప్రతినిధిగా సేవలు అందించే బాధ్యత అప్పగించారు. దీంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ (కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్) నిర్వహణ బాధ్యతలను అజయ కుమార్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications