వారాహి టీమ్స్ కు పవన్ థ్యాంక్స్-రెండో విడత యాత్రపై కీలక సూచనలు..
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి తొలిదశ యాత్ర విజయవంతంగా పూర్తయింది. ఇప్పుడు ఏలూరు నుంచి రేపు రెండోదశ యాత్ర ప్రారంభించేందుకు పవన్ సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి టూర్ కోసం ఏర్పాట్లు చేస్తున్న, సమన్వయం చేస్తున్న కమిటీలతో పవన్ ఇవాళ భేటీ అయ్యారు. తొలిదశ యాత్ర విజయవంతం చేసిన కమిటీల సభ్యులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే రెండోదశలోనూ అదే పట్టుదలతో పనిచేయాలన్నారు. మీ కష్ణం వృథా కాదన్నారు.
వారాహి విజయ యాత్రను దిగ్విజయం చేసేందుకు క్షేత్రస్థాయిలో పార్టీ అంతర్గత కమిటీల సభ్యులు చేసిన కృషి, పడిన కష్టం కళ్లారా చూశానని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ పోరాటం వృథా కాదన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు. యాత్ర నిర్వహణకు ఏర్పాటు చేసిన కమిటీలతో పవన్ కళ్యాణ్ ఇవాళ సమావేశమయ్యారు.

వారాహి యాత్ర తొలి విడతను విజయవంతం చేయడంలో భాగమైన కమిటీలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. క్యాటరింగ్ కమిటీ, వాలంటీర్ కమిటీ, అకామిడేషన్ కమిటీ, మెడికల్ కమిటీ, మీడియా కోఆర్డినేషన్ కమిటీ సభ్యులను పేరు పేరున పలకరిస్తూ ధన్యవాదాలు తెలిపారు. వారాహి విజయ యాత్ర కోసం నియమించిన ప్రతి కమిటీ క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమకోర్చి పని చేసిందన్నారు. మీ అందరి కృషి, సహకారాలతోనే తొలి విడత విజయవంతంగా ముగించగలిగామన్నారు.

ఆదివారం నుంచి ప్రారంభం కానున్న మలి విడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో మనందరం కలిసి విజయవంతం చేద్దామని పవన్ నేతలకు పిలుపునిచ్చారు. వారాహి విజయయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తే ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పాదముద్ర బలంగా ఉంటుందని అర్ధమైందన్నారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చూడాలంటే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే వైసీపీ పతనం ప్రారంభం కావాలన్నారు. ఇక్కడ ప్రారంభమైతే అది రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందన్నారు. ప్రజాకంటక పాలన విముక్తి చేయడానికి మనం ఎంత బలంగా ముందుకు వెళితే రాష్ట్రానికి అంత మేలని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications