తమిళ నేతలను చూసి నేర్చుకోండి: ఏపీ నేతలకు పవన్, ఏం జరుగుతుందో చెప్పలేమని హెచ్చరిక
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో వరుస పోస్టులు పెట్టారు. తమిళనాడు సీఎం పళనిస్వామి ప్రధాని మోడీకి సేలమ్ స్టీల్ ప్లాంట్‌పై ఇస్తున్న మెమోరాండాన్ని కూడా పోస్ట్ చేశారు.
సేలమ్ స్టీల్ ప్లాంటును ప్రయివేటీకరించవద్దని శనివారం పళని ప్రధాని మోడీని కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిని ఉదహరిస్తూ ఏపీ రాజకీయ నాయకులు కూడా అలాగే వ్యవహరించాలని సూచించారు. ఏపీ నేతలు తమిళనాడు నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

ఏపీ ఎంపీలకు విజ్ఞప్తి చేస్తున్నా
ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యులకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని, డీసీఐ ప్రయివేటీకరణపై ప్రధాని మోడీకి మీరు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలని, తమిళనాడు సీఎం ఇచ్చారని, మీరు అలాగే చేయాలని పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు ట్వీట్ చేశారు.
Recommended Video


ఆశ్చర్యం వేస్తోంది, అడగడానికి అవరోధం ఏమిటి
తమ రాష్ట్ర ప్రజల తరఫున, తమ రాష్ట్రం కోసం తమిళనాడు నాయకులు నిలబడుతున్నారని, తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని, ఏపీ నాయకులు కూడా ఇలాగే చేయడానికి అవరోధంగా ఏం ఉందని పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఏపీ నేతలు కూడా అడగాలని చెప్పారు.

ఏం జరుగుతుందో చెప్పలేం
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులను బట్టి డీసీఐ న్యూఢిల్లీకి (కేంద్రానికి) చిన్న విషయంగా కనిపిస్తూ ఉండవచ్చునని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. కానీ అస్తవ్యస్త విభజన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ నెరవేర్చని పరిస్థితుల్లో రాజకీయాలు ఎటు తిరుగుతాయో ఎవరూ చెప్పలేరని అభిప్రాయపడ్డారు.

రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకొద్దాం
ఈసారీ పార్టీ కేంద్ర, వ్యక్తి కేంద్ర రాజకీయాలకు చెక్ చెప్పాలని, ఇప్పుడు మనం రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకు రావాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. లేదంటే యువత, భవిష్యత్తు జనరేషన్ అందుకు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు.












Click it and Unblock the Notifications