children's day: చిన్న పిల్లలతో పిల్లాడిలా పవన్ కళ్యాణ్ (ఫోటోలు)
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చిన్నారులతో కలిసి బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బాలల దినోత్సవ వేడుకల సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ చిత్ర పటానికి పవన్ కళ్యాణ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రెండు గంటలపాటు పిల్లలతోనే..
అనంతరం పార్టీ కార్యాలయానికి తరలివచ్చిన చిన్నారులందరినీ ప్రేమతో పలుకరించి వారితో ముచ్చటించారు. సుమారు రెండు గంటల సేపు వారితో గడిపారు పవన్ కళ్యాణ్. వారు ప్రేమతో ఆయనకు ఇచ్చిన గులాబీలను స్వీకరించారు.

పిల్లలతో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్
కల్లా కపటం తెలియని వారి మాటలకు మురిసిపోయారు. కొందరిని గుండెలకు హత్తుకొన్నారు.. ఇంకొందరిని ఎత్తుకున్నారు. వాళ్లతో ఫోటోలు దిగారు. వారి కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన నీతి కథలు, బొమ్మలతో కూడిన రామాయణ, మహాభారత పుస్తకాలు, తెనాలి రామకృష్ణుని కథలు, జాతక కథలు, జో కొట్టే కథలు, బామ్మ చెప్పిన కథలు, అతిలోక కథల పుస్తకాలను పంపిణీ చేశారు.

మాతృభాష గురించి..
తెలుగు భాష విశిష్టతను, మాతృ భాష గురించి చెప్పే అమ్మ నుడి పత్రికను అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పోతిన మహేష్, బత్తిన రాము, అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకురావడాన్ని బలంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆయన ఘాటు విమర్శలు చేశారు. తెలుగు భాషను మంట గలపాలను చూస్తే మీ 150 ఎమ్మెల్యేలంతా మట్టిలో కలిసిపోతారని పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Recommended Video

ఇదే తమ విధానమంటూ..
‘ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు మాతృ భాషలో బోధన ఎలా అనే అంశంపై పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనసేన ప్రభుత్వం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మాధ్యమంలో చదివే వారికి రుసుములు ప్రభుత్వమే చెల్లించే విధానం తెస్తాం' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘కస్తూరి రంగన్ నేతృత్వంలోని కమిటీ 2019 జాతీయ విద్యా విధానానికి సంబంధించిన ముసాయిదాను డాక్టర్ రమేష్ బాబు మా దృష్టికి తీసుకువచ్చారు. ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాతృ భాషలోనే బోధన చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేసేలోపే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంగ్లీష్ లో బోధన చేయాలనే విధానాన్ని తీసుకువచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకం. ఇదే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం' అని పవన్ కళ్యాణ్ తెలిపారు.












Click it and Unblock the Notifications