పౌరుషం చచ్చిందా, నోరు రాలేదా: జగన్‌పై పవన్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తిరుపతిలో బుధవారం సాయంత్రం జరిగిన బహిరంగ సభలో ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో, బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో కలిసి వేదికను పంచుకున్నారు. జగన్‌లో సీమాంధ్ర పౌరుషం చచ్చిపోయిందా, కెసిఆర్ పదే పదే సీమాంధ్ర ప్రజలను కించపరుస్తుంటే నోరు రాలేదా అని ఆయన అడిగారు. తాను పార్టీ పెట్టి యాభై రోజులే అవుతోందని, తాను కెసిఆర్‌పై మాట్లాడానని, జగన్ పార్టీ పెట్టి నాలుగేళ్లవుతున్నా కెసిఆర్‌పై మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు.
సీమాంధ్రలో వైయస్సార్సిపి హఠావో, సీమాంధ్ర బచావో అనే నినాదం ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు. జగన్ తెలంగాణలోని తండా తండాకు, పల్లె పల్లెకూ వెళ్లాలని, ఆ దమ్ము ధైర్యం జగన్‌కు ఉందా అని, ఆ ధైర్యం చూపిన తర్వాతనే జగన్ సీమాంధ్రకు రావాలని ఆయన అన్నారు. తన మీద కేసులు పెట్టారని, కేసులకు తాను భయపడబోనని, జైలుకు వెళ్లడానికి కూడా భయపడబోనన, తెలుగు ప్రజల ఐక్యత కోసం నిలపబడుతానని ఆయన అన్నారు. మోడీకి కెసిఆర్ క్షమాపణ చెప్తే తాను క్షమాపణ చెబుతానని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ సీమాంధ్రకు మొండి చేయి చూపించారని, విసిరికొట్టాడని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు దొందూ దొందేనని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని గెలిపిస్తే కెసిఆర్‌ను, సోనియాను గెలిపించినట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి అనుభవం ఉన్న నాయకుడు ఎవరున్నారని చూస్తే తనకు చంద్రబాబు కనిపించారని, అందుకే దేశం కోసం మోడీకి, రాష్ట్రం కోసం చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు. తన వద్ద దమ్మిడీ ఆదాయం లేదని, తాను చెప్తే ఓట్లు వేస్తారో లేదో తెలియదని, దేశపౌరుడిగా తాను చేయదలుచుకుంది అదేనని, ప్రజల బాగు కోసం అది చేయదలుచుకున్నానని ఆయన అన్నారు. చినుకు చినుకు కలిస్తే సముద్రమైనట్లు మీరంతా కలిస్తే బలమైన శక్తి అవుతుందని, అది దేశానికీ సమాజానికీ అవసరమని ఆయన అన్నారు.
తిరుపతితో తన అనుబంధం ఇప్పటిది కాదని, తాను యోగా ఇక్కడే నేర్చుకున్నానని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీని అన్నయ్య స్థాపించారని, వైయస్ పాలనతో విసిగిపోయి తాను మద్దతు ఇచ్చానని, తాను రాజకీయాల్లోకి గానీ సినిమాల్లోకి గానీ వస్తానని అనుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రం విడిపోయిన స్థితిలో దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఇలా మాట్లాడుతానని కూడా తాను అనుకోలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతమైందని, దాని వెనక వైయస్ రాజశేఖర రెడ్డి, ఆయన అనుచరులూ ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు.
సీమాంధ్రపై తెలంగాణలో ద్వేషం పెరిగేలా వైయస్ కుటుంబం, అనుచరవర్గం, చుట్టూ ఉన్న గుంపు చేశాయని ఆయన విమర్శించారు. కెసిఆర్ సీమాంధ్ర ప్రజలను తిడుతుంటే, చులకన చేస్తుంటే, సీమాంధ్ర ప్రజలను తరిమికొడుతామని అంటుంటే, వారిని సెటిలర్లు అంటుంటే ఎవరూ మాట్లాడాలేదని, తాను రాజకీయ నాయకుడ్ని కాదని నటుడిని మాత్రమేనని, తనకు బాధ కలిగిందని ఆయన అన్నారు. విధ్వంసం సులభం, నిర్మాణమే కష్టమని ఆయన అన్నారు. ఐదేళ్ల గురించి కాదు, ఐదు తరాల గురించి అలోచించాలని ఆయన అన్నారు. కెసిఆర్ మాట్లాడుతుంటే బాధ కలిగిందని ఆయన అన్నారు.
సీమాంధ్ర నాయకులను విమర్శించాలి గానీ సీమాంధ్ర ప్రజలు ఏం చేశారని ఆయన అడిగారు. కెసిఆర్ సీమాంధ్ర ప్రజలను కించపరిచారని ఆయన అన్నారు. తాను విదిలించలేక, తనకు దమ్మూ ధైర్యమూ లేక కాదు... దేశభద్రత, సమగ్రతకోసం బాధ్యతతో ఇన్నాళ్లూ మాట్లాడలేదని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబమంటేనే కాదు, ఎవరన్నా తనకు భయం లేదని ఆయన అన్నారు. మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిస్తే 111 అవుతుందంటే, దాన్ని కెసిఆర్ పంగనామాలు ఉన్నాడని ఆయన చెప్పారు. నామాలంటే తనకు ఆపద మొక్కులవాడు, వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడని, కెసిఆర్‌కు పంగనామాలు కనిపించాయని, ఎవరి జన్మసంస్కారాన్ని బట్టే అవి కనిపిస్తాయని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజలను కెసిఆర్ బూతులు తిడుతుంటే జగన్‌కు నోరు రాలేదా అని ఆయన అడిగారు. జగన్ సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నారని, సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడలేని జగన్‌కు ఆ హక్కు లేదని ఆయన అన్నారు. తెలంగాణ రావడానికి జగన్, వైయస్ రాజశేఖర రెడ్డి, వారి అనుచరులు కారణమని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజలపై తెలంగాణ ప్రజలకు ద్వేషం లేదని, కెసిఆర్‌కు మాత్రమే ఉందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరుపై విసుగు వచ్చి, ఎవరూ మాట్లాడరేమిటని తాను వచ్చానని పవన్ కళ్యాణ్ చెప్పారు.
భారత ప్రజలు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నరేంద్ర మోడీని గుండెలకు హత్తుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు పునర్మిర్మాణమే జరగాలి, కానీ సీమాంధ్రకు నిర్మాణమే లేనది, సీమాంధ్ర నిర్మాణం జరగాలంటే మోడీ ప్రధాని కావాలని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు వస్తే దోపిడీ సాగుతుందని ఆయన అన్నారు. సర్దార్ పటేల్ సంస్థానాలను రద్దు చేస్తే, వైయస్సార్ సెజ్‌ల పేరు మీద కొత్త సంస్థాలను తయారు చేశారని ఆయన అన్నారు. మోడీ ప్రధాని అవుతుంటే కెసిఆర్ కించపరిచారని, దాంతో తనలో సహనం చచ్చిపోయిందని, కెసిఆర్ నోరంతా విషమేనని ఆయన అన్నారు. ఒక్క చెంప మీద కొడితే రెండు చెంపలు వాయిస్తామని ఆయన అన్నారు. కెసిఆర్ కుటుంబానికి తాను భయపడేవాడిని కానని, దేశ సమగ్రతకు భంగం కలిగించేవారిని సహించలేనని ఆయన అన్నారు.
సమైక్యాంధ్ర కోసం తాను ఎంతో ప్రయత్నం చేశానని తెలుగుదేశం పార్టీ నాయకుడు శివప్రసాద్ చెప్పారు. సాగునీళ్లు, రాజధాని, ఇతర అంశాలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదని అన్నారు. చట్టసభల తలుపులు మూసి మనకు అన్యాయం చేశారని ఆయన దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications