నాగబాబు పోటీ పై పవన్ నిర్ణయం మార్పు..!!
మెగా బ్రదర్ నాగబాబు పోటీ చేస్తున్నారా. పోటీ నుంచి తప్పుకున్నారా. ఇప్పుడు జనసేనలో జరుగుతున్న చర్చ ఇది. పొత్తులో భాగంగా జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు. అందులో భాగంగా అనకాపల్లి ఎంపీగా నాగబాబును బరిలోకి దించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు నియోజకవర్గ పరిధిలోనే ఇల్లు తీసుకున్న నాగబాబు పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ, ఇప్పుడు పవన్ తన సోదరుడు పోటీ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఈ సారి గోదావరితో పాటుగా విశాఖ జిల్లాల్లో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే అయిదు స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించిన పవన్... మరో 19 స్థానాలకు ఖరారు చేయాల్సి ఉంది. మూడు ఎంపీ స్థానాల్లో భాగంగా కాకినాడ, మచిలీపట్నం, అనకాపల్లి స్థానాల నుంచి పోటీకి తమ అభ్యర్దులను ఎంపిక చేస్తున్నారు. అనకాపల్లి నుంచి సోదరుడు నాగబాబును బరిలోకి దించాలని తొలుత నిర్ణయించారు. ఈ మేరకు నాగబాబు స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకొని ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. అయితే, టీడీపీ సీట్ల ఖరారు తరువాత ఉమ్మడి విశాఖలో సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో, పవన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం.

అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలలో నాగబాబు చేసిన సమీక్షలకు మాజీ ఎంపీ, మాజీ మంత్రి కొణతాలను ఆహ్వానించలేదు. అది పార్టీలో చర్చనీయాంశమైంది. దీంతో..కొణతాలకు అనకాపల్లి అసెంబ్లీ స్థానం కేటాయిస్తూ తొలి జాబితాలోనే సీటు ప్రకటించారు. ఈ నిర్ణయంతో నాగబాబు మద్దతిచ్చిన సుందరపు సతీష్ కోటరీకి గండి పడింది. అనకాపల్లిలో కొణతాల యాక్టివ్ అయ్యారు. ప్రతీ సీటు కీలకంగా మారుతున్న వేళ నాగబాబుకు అనకాపల్లి ఎంపీ పరిధిలో సమీకరణాలకు సహకరించటం లేదని గుర్తించారు. ఫలితంగా నాగబాబును మరో చోటకు మార్పు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉండే అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో నాగబాబు కంటే బలమైన అభ్యర్ది కోసం అన్వేషణ మొదలైంది. దీంతో, ఇప్పుడు నాగబాబు ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications