విశాఖ కేంద్రంగా పవన్ బిగ్ స్కెచ్ ? ఆ రిపోర్ట్స్ తో అలర్ట్..! "సేనతో సేనాని వెనుక" ?
ఏపీలో జనసేన పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. కూటమి పేరుతో టీడీపీ, బీజేపీని కలుపుకుని గత ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ తో ఘన విజయం అందుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత చాలా బిజీ అయిపోయారు. ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన పార్టీని బలోపేతం చేసుకోవడం, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో నిరంతరం భేటీ కావడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం వంటి పనులకు సమయం కేటాయించలేకపోతున్నారు. దీంతో పరిస్ధితి చేజారే ప్రమాదం పొంచి ఉందన్న నివేదికలతో పవన్ అలర్ట్ అయ్యారు.
తాజాగా కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వెలువడిన సర్వేల్లో జనసేన తరఫున తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నియోజకవర్గాల్లో వారికి బదులు టీడీపీ ఇన్ ఛార్జ్ లే పెత్తనం చేస్తున్నారని తేలింది. ఇదే పరిస్దితి కొనసాగితే వీరంతా మరోసారి గెలవడం కూడా కష్టమేనని సర్వేలు తేల్చేశాయి. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు నేరుగా ఈ విషయం చెప్పుకునే పరిస్ధితి లేకపోవడం, పార్టీలో ఇతర నేతలకు చెప్పినా పరిస్దితిలో ఏమార్పూ లేకపోవడం వంటి కారణాలతో ఎమ్మెల్యేల్లోనూ అసంతృప్తి నెలకొంది.

అలాగే క్షేత్రస్దాయిలో కూటమి పార్టీ టీడీపీతో సర్దుకుపోవాలని పవన్ ఇస్తున్న సంకేతాలపైనా క్యాడర్ లో అసంతృప్తి పెరుగుతోంది. కూటమిలో తక్కువ సీట్లు తీసుకుని గెలుపుకు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినా తమను చిన్న చూపు చూస్తున్నారని, ఈ విషయంపై పార్టీకి ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని క్యాడర్ లో అసహనం ఉంది. అయితే క్షేత్రస్ధాయిలో విషయాల్ని చిన్నవిగా చూస్తూ పవన్ కూడా పట్టించుకోవడం లేదనే అసంతృప్తి పెరుగుతుండటంతో ఆయన అలర్ట్ అయ్యారని తెలుస్తోంది.

అందుకే విశాఖలో హడావిడిగా ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జనసేన పార్టీకి సంబంధించి వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఇందులో పార్టీ నాయకులతో భేటీలు, జనసేన శాసనసభాపక్ష సమావేశం, చివరిగా విస్తృత భేటీ నిర్వహించనున్నారు. వీటి ఏర్పాట్లపై ఇవాళ విశాఖలో పార్టీ నేతలతో మంత్రి నాదెండ్ల మనోహర్ చర్చించారు. 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు విశాఖలో పార్టీ ముఖ్య కార్యక్రమాలు ఉంటాయని, వీటికి సేనతో సేనాని అని పేరు పెట్టామని ఆయన తెలిపారు. 28వ తేదీ ఉదయం జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, మధ్యాహ్నం పార్టీ కార్యవర్గ సమావేశం ఉంటుందన్నారు. సేనతో సేనాని పేరు వెనుక పవన్ క్యాడర్ తో రీకనెక్ట్ కాబోతున్నరనే సందేశం ఇవ్వడమే ముఖ్య లక్ష్యంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications