40 సీట్లు, రెండున్నారేళ్ల సీఎం - పట్టుబిగిస్తున్న పవన్ కల్యాణ్..!!
ఏపీలో ఈ సారి ఎన్నికలు పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. తన సంక్షేమం - సామాజిక న్యాయం మరోసారి అధికారం ఇస్తామనే నమ్మకంతో సీఎం జగన్ ఉన్నారు. అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటు జనసేన, టీడీపీ పొత్తులో సీట్ల పంపకాల పైన చర్చ మొలైంది. బీజేపీ నిర్ణయం తెలిసిన తరువాత అధికారిక ప్రకటనకు సిద్దమవుతున్నాయి. పొత్తు కొనసాగిస్తూనే పవన్ పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
జనసేనకు 40 సీట్లు : వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా జనసేకు 20-25 సీట్లు ఇస్తాయనే ప్రచారం సాగుతోంది. కానీ, పవన్ కల్యాణ్ 40 సీట్లకు తగ్గకుండా తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో జనసేనకు పెరుగుతున్న మద్దతు..కొద్ది రోజులుగా పార్టీలో చేరికల తో పార్టీలో జోష్ పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీకి టీడీపీ ఇచ్చిన సీట్లు కాకుండా..తాము కోరిన విధంగా సీట్లు దక్కించుకొనేలా పవన్ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. పవన్ సీఎం కావాలని జనసైనికులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ సీఎం పదవి షేరింగ్ ఆలోచనే లేదంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక, ఇప్పుడు పవన్ ఆలోచనలను మాజీ ఎంపీ చేగొండి హరి రామజోగయ్యతో షేర్ చేసుకున్నారు.

జోగయ్య తాజా లేఖలో : మాజీ ఎంపీ హరిరామ జోగయ్య తాజాగా లేఖ రాసారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. వచ్చే ఎన్నికల్లో 40-60 సీట్లు దక్కించుకోవాలని తాను సూచించిన అంశాన్ని వెల్లడించారు. కాగా, పవన్ కల్యాణ్ 40 సీట్ల వరకు తీసుకుంటున్నట్లు చెప్పారని వివరించారు. పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని జనసైనికులు భావిస్తున్న విషయాన్ని వివరించానన్నారు. ముఖ్యమంత్రి కనీసం రెండున్నర ఏళ్లయినా పవన్ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంించారు. జనసేన గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా ఉంటుందని పవన్ ఆశిస్తున్నారని జోగయ్య చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి వెళ్లే ఆంశం పైన చర్చించినట్లు పేర్కొన్నారు.

రెండున్నారేళ్ల సీఎం పదవి : 2019 ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 61 స్థానాల్లో పది వేల ఓట్లు వచ్చిన విషయాన్ని జోగయ్య గుర్తు చేసారు. 40 స్థానాల్లో 15 వేల ఓట్లు దక్కించుకున్నట్లు వివరించారు. రెండున్నారేళ్లు ముఖ్యమంత్రిగా పవన్ ను ప్రకటిస్తేనే జనసేన నుంచి ఓట్ల బదిలీ పొత్తులో సాధ్యమవుతుందని జోగయ్య స్పష్టం చేసారు. నర్సాపురం, భీమవరం, తాడేపల్లి గూడెం నియోజకవర్గాల్లో ఒక చోట నుంచి పోటీ చేయాలని పవన్ ను జోగయ్య కోరారు. అధికార పంపిణీ విషయంలో జనసైనికుల గౌరవానికి ఎలాంటి భంగం వాటిల్లకుండా తన నిర్ణయాలు ఉంటాయని పవన్ హామీ ఇచ్చారని వెల్లడించారు. దీని ద్వారా సీట్ల పైన చర్చల సమయంలో పవన్ 40 సీట్ల కోసం పట్టుబట్టే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications