వాళ్లకు పవన్ కల్యాణ్ వార్నింగ్ సిగ్నల్స్: కోర్పోరేషన్ ఎన్నికల్లో ఫైట్
విజయవాడ: ప్రత్యేక హోదాపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం తెలుగుదేశం, బిజెపిల్లో ఏ పార్టీకి అనుకూలమనే చర్చ సాగుతుండగానే మరో విషయం చర్చలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలకు కూడా పవన్ కల్యాణ్ షాక్ ఇవ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కార్పోరేషన్ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గ్రేటర్ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఒంగోలు కార్పోరేషన్ ఎన్నికల్లో జనసేన తరఫున అభ్యర్థులను పోటీకి దింపాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగానే ఈ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉందని చెప్పుతున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్న పవన్ కల్యాణ్ కార్పోరేషన్ ఎన్నికల ద్వారా తన బలాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాకినాడలో సెప్టెంబర్ 9వ తేదీన జరిగే బహిరంగ సభలో కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై పవన్ కల్యాణ్ స్పష్టత ఇస్తారని అంటున్నారు. గత ఎన్నికల్లో బిజెపి, టిడిపి కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కల్యాణ్ ఆ రెండు పార్టీల పట్ల కూడా విసిగిపోయినట్లు కనిపిస్తున్నారని అంటున్నారు.
ప్రత్యేక హోదా కోసం తాను మూడంచెల ఉద్యమం చేపడుతానని పవన్ కల్యాణ్ తన తిరుపతి బహిరంగ సభ ప్రసంగంలో చెప్పిన విషయం తెలిసిందే. తొలి విడతగా ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. చివరగా కార్పోరేషన్ ఎన్నికలను ఆ రెండు పార్టీలపై పోరాటంగా ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications