అన్నయ్య కాదు కదా: సాక్షికి పవన్ కళ్యాణ్ రిప్లై
చిత్తూరు: రాష్ట్ర విభజనకు కారకుడు తన అన్నయ్య, కేంద్రమంత్రి చిరంజీవి కాదు కదా అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అందుకే తన అన్నయ్యపై విమర్శలు చేయడం లేదని, సాక్షి పత్రికలో వచ్చిన కథనానికి కౌంటర్ ఇచ్చారు. సాక్షి తనపై అనుచిత విమర్శలు చేస్తోందని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సభలో ఆయన మాట్లాడుతూ.. తన అన్నయ్యపై తనకు గౌరవం ఉందని చెప్పారు.
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావులపై ఈ సందర్బంగా పవన్ విరుచుకుపడ్డారు. కెసిఆర్‌తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజలను కెసిఆర్ తిడుతుంటే.. జగన్ ఒక్క మాట మాట్లాడటం లేదని, జగన్‌కు సీమ పౌరుషం లేదా అని ప్రశ్నించారు. కెసిఆర్‌ను తిట్టే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదని అన్నారు.

సీమాంధ్ర ప్రజలను తిడుతున్నది కెసిఆర్ కుటుంబం మాత్రమేనని, తెలంగాణ ప్రజలకు సీమాంధ్ర ప్రజలపై ఎలాంటి ధ్వేషం లేదని పవన్ అన్నారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదని పవన్ అన్నారు. రాష్ట్ర విభజనకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి దోపిడీయే కారణమని పవన్ ఆరోపించారు.
వైయస్ 50 ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట తెలంగాణలోని భూములను అడ్డదిడ్డంగా అమ్మేశారని ఆరోపించారు. తండ్రి చనిపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేయించుకున్నారని పవన్ ఆరోపించారు. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మోడీతో పాటు టిడిపి అధినేత చంద్రబాబు, బిజెపి సీనియర్ నేత వెంకయ్యనాయుడు, పవన్‌కల్యాణ్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications