దాడులు చేస్తే కేసులు పెట్టరా?: అధికార పార్టీ గూండాలంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి: జనసేన కార్యకర్తలపై దాడులకు పాల్పడినవారిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పక్షాన నిలిచిన అభ్యర్థులు, పార్టీ శ్రేణులపై అధికార పార్టీ గూండాలు దాడులకు తెగబడి ప్రాణాలు హరించాలని చూడటం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు.
ఆసక్తికరంగా తిరుపతి పోరు- వైసీపీకి టీడీపీ, జనసేన సాయం- ఎలాగో తెలుసా ?

అది వైసీపీ నేతల ఫ్యాక్షన్ నైజం..: పవన్ కళ్యాణ్
అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో గుంటిపల్లి గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటన వైసీపీ నాయకుల ఫ్యాక్షన్ నైజాన్ని తెలియచేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతుతో వార్డు సభ్యుడిగా పోటీ చేసిన నగేష్, ఆయన తరఫున పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న మునీంద్రతోపాటు మరో జనసైనికుడు వేణుగోపాల్‌లపై అక్కడి వైసీపీ నాయకులు మారణాయుధాలతో పాశవికంగా దాడి చేసి హత్యకు ప్రయత్నించారు. ఈ దుశ్చర్యపై పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయకపోవడాన్ని అధికారుల బాధ్యతారాహిత్యం అనుకోవాలా... వారిపై అధికారపక్షం ఒత్తిళ్ళు పని చేశాయి అనుకోవాలా? అని పవన్ కళ్యాణ్ నిలదీశారు.

ప్రాణాలు తీస్తారా? అంటూ పవన్ కళ్యాణ్ మండిపాటు
జనసేన మద్దతుతో ఎన్నికల్లో నిలుచున్నందుకు ప్రాణాలు తీయాలనుకోవడం ఆటవిక సంస్కృతికి నిదర్శనం. తమకు ఎదురు ఎవరూ నిలబడకూడదు అనుకొంటే ఇక ఎన్నికలు ఎందుకు? పెత్తందారీ పోకడలతో వెళ్ళాలి అనుకొంటే మేము తప్పకుండా ప్రజాస్వామ్య రీతిలో... డా. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ విలువల ప్రకారం పోరాటానికి సిద్దమవుతామని జనసేనాని వ్యాఖ్యానించారు.

రాష్ట్రమంతా ఫ్యాక్షన్ పోకడలంటూ పవన్ ఫైర్
వైసీపీ పాలనలో ఫ్యాక్షన్ పోకడలు రాష్ట్రమంతటా విస్తరించాయి. అమలాపురంలో మా పార్టీ నాయకులు లింగోలు పండుపై దాడికి దిగి ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు. అందుకు కారకులెవరో పోలీసులు నిగ్గు తేల్చాలి. అదే విధంగా నూజివీడులో అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు జనసైనికుడు మండలి రాజుపై దాడి చేశారు. అనంతరం పార్టీ జెండా దిమ్మెను ధ్వంసం చేశారు.

వైసీపీ విజయంలో నిజాయితీ ఉందా? పోలీసులు ఒత్తిళ్లకు తలొగ్గొద్దు
అన్ని చోట్లా తామే గెలిచాం అని చెప్పుకొంటున్న వైసీపీ నాయకులు.. జనసేన నాయకులు, శ్రేణులపై దాడులకు తెగబడుతున్నారు అంటే వారి విజయంలో నిజాయతీ లేదని అర్థం అవుతోంది. బెదిరింపులకు పాల్పడి గెలిచిన వైసీపీలో అభద్రతాభావం పెరిగి ఈ విధమైన హింసకు దిగుతున్నారు. ఈ అధికారిక దుర్మార్గాలపై పోలీసు శాఖ నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ గూండాల ఒత్తిళ్లకు తలొగ్గి కేసులు నమోదు చేయని పక్షంలో జనసేన పార్టీ చట్టబద్ధంగా ముందుకు వెళ్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు.