చిన్నప్పుడే ఎంజీఆర్‌ను కలిశా
Pawan Kalyan: సనాతన ధర్మ పరిరక్షణపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. అక్కడ అధికారంలో ఉన్న డీఎంకే యువజన విభాగం అధినేత, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి వచ్చిందాయనకు.
గతంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెంగ్యూ, మలేరియా తరహాలోనే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాల్సిన అవసరం ఉందంటూ ఓ సమావేశంలో బహిరంగంగా విమర్శలు చేశారు. అప్పట్లో నిరసనలను ఎదుర్కోవాల్సి వచ్చింది.

అవే వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ ఇటీవలే తిరుపతిలో నిర్వహించిన వారాహి సభలో ప్రస్తావించారు. ఎక్కడా ఉదయనిధి స్టాలిన్ పేరు ఎత్తకుండా విమర్శలు గుప్పించారు. ఫలితంగా డీఎంకే నుంచి ఎదురుదాడిని ఎదుర్కొనాల్సి వచ్చింది పవన్ కల్యాణ్‌కు. దీనిపై ఉదయనిధి సైతం స్పందించారు.
ఈ పరిస్థితుల మధ్య డీఎంకే రాజకీయ ప్రత్యర్థి పార్టీ ఏఐఏడీఎంకేకు మద్దతుగా ఓ ట్వీట్ పోస్ట్ చేయడం చర్చనీయాంశమౌతోంది. తన వ్యక్తిగత ఎక్స్ అకౌంట్ హ్యాండిల్ నుంచి పోస్ట్ పెట్టారు. ఈ నెల 17వ తేదీన 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకొంటోన్న ఏఐఏడీఎంకేకు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
అన్నా డీఎంకే వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్‌పై ఆసియా వీక్ ప్రచురించిన కవర్ పేజీ ఫొటోను తన ట్వీట్‌కు జత చేశారు పవన్ కల్యాణ్. పురచ్చి తలైవాగా అభివర్ణించారు. తన బాల్యం చెన్నైలో గడిచిందని, అప్పట్లో ఎంజీఆర్ నుంచి స్ఫూర్తి పొందానని వ్యాఖ్యానించారు.
చెన్నై మైలాపూర్‌లో చదువుకుంటోన్నప్పుడు తమిళ ఉపాధ్యాయుడి ద్వారా ఎంజీఆర్‌ను కలిశానని పవన్ కల్యాణ్ గుర్తు చేసుకున్నారు. తిరుక్కరల్ నుంచి తీసుకున్న వాక్యాలను ట్వీట్‌లో పొందుపరిచారు. పరోపకారం, క్షమాగుణం, నిష్కల్మషం, ప్రజల పట్ల శ్రద్ధ ఉన్న వాళ్లే రాజులా వెలుగొందుతారనే అర్థం వచ్చే వాక్యాలవి.












Click it and Unblock the Notifications