ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థిని చంపేసినట్లు.. : సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను చెప్పినట్లుగానే తెలుగు భాష కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శల దాడిని కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జగన్ ఏమన్నారంటే..
‘‘జగన్ రెడ్డి గారు 21-11న కొమ్మనాపల్లి సభలో తెలుగు భాష నిర్మూలనను సమర్థించుకొంటూ మాట్లాడినది: ‘ఎంతమంది శత్రువులనైనా ఎదిరిస్తా. ఎంతమంది శత్రువులు కలిసి వచ్చినా నేను తట్టుకుంటా. మీరు వాళ్లని నిలదీయండి. ఇంగ్లీష్‌పై తప్పుగా మాట్లాడేవారిని నిలదీయండి'' అని జగన్ చేసిన వ్యాఖ్యలను పవన్ ప్రస్తావించారు

ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకురాకండి
దీనికి జనసేన సమాధానం అంటూ ‘దయచేసి పిల్లల చదువుల్లోకి ఫ్యాక్షన్ సంస్కృతి తీసుకురాకండి. తెలుగు భాష, ఇంగ్లీష్ భాష అనే భేదం తీసుకొచ్చి రెండు వర్గాలుగా చేయొద్దు. మాతృ భాష నేర్పమంటే దుర్భాషలాడతారా?' అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు.

ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థిని చంపేసినట్లు..
‘ఇంగ్లీష్ వద్దనడం లేదు.. మాతృ భాష వదలొద్దు అంటున్నాం. ఫ్యాక్షన్ గొడవల్లో ప్రత్యర్థిని చంపేసినట్లు-భాషను నిర్మూలించడానికి, భాష ఏమీ రాత్రికి రాత్రి పుట్టింది కాదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వారసత్వంగా భాషా సంపద వస్తోంది. చిరస్థాయిగా ఉంటుంది' అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

మాకు బాగా తెలుసు
‘తెలుగు భాషను, తెలుగు సంస్కృతిని, భారత దేశ సనాతన ధర్మాన్నీ, మీరు ఇంగ్లీష్ మాధ్యమం ముసుగులో చంపేద్దామని చేస్తున్న ప్రయత్నం అర్థం కాని వాళ్లు ఎవరూ లేరు. తెలుగు భాష, సంస్కృతిపై మీరు చేస్తున్న దాడిని ప్రజలు బలంగా ఎదుర్కొంటారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి.. జాతి గుండె చప్పుడు. మీలాంటివాళ్ల నుంచి భాషా సంస్కృతులను ఎలా రక్షించుకోవాలో మాకు బాగా తెలుసు' అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications