మోడీ వచ్చింది అందుకే: ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో బొప్పూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
అభివృద్ధిలేక అప్పులతో నలిగిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ప్రధాని నరేంద్ర మోడీ రాక బలాన్నిచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్డీయే (NDA) పునర్ కలయిక ఐదు కోట్ల మందికి ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. మూడోసారి ప్రధానమంత్రి అయి హ్యాట్రిక్ కొట్టబోతున్న మోడీకి ఏపీ ప్రజల తరఫున ఘన స్వాగతం తెలుపుతున్నారని పెర్కోన్నారు.

2014లో తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రారంభమైన పొత్తు.. ఇప్పుడు బెజవాడ దుర్గమ్మ సాక్షిగా కొత్త రూపు తీసుకోబోతోందని పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. అమరావతికి అండగా ఉంటానని చెప్పేందుకే ప్రధాని మోడీ వచ్చారని, అమరావతి దేదీప్యమానంగా వెలగబోతోందని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక సారా వ్యాపారిగా మారారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
అయోధ్యలో రామాలయం కట్టిన మోడీకి.. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిన చిటికనవేలంత రావణాసురుడిని తీసేయటం కష్టం కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. డబ్బు అండ చూసుకుని ఏదైనా చేయగలనని జగన్ రెడ్డి విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. గుజరాత్‌లోని ద్వారక నుంచి వచ్చిన మోడీ.. ఎన్నికల కురుక్షేత్రంలో పాంచజన్యం పూరిస్తారన్నారు.
దేశమంతా డిజిటల్ ట్రాన్సక్షన్ చేస్తుంటే.. ఏపీలోని మద్యం షాపుల్లో మాత్రమే నగదు చలామణి చేసి దోచుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన ఎన్నో పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని మండిపడ్డారు. పారిశ్రామిక ప్రగతి 2019లో 10.24 శాతం ఉండగా, ఈరోజు -3 శాతానికి దిగజారిపోయిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏపీలో రామరాజ్యం స్థాపన జరుగబోతోందని.. ధర్మానిదే విజయం-పొత్తుదే గెలుపు- కూటమిదే పీఠం అని పవన్ కళ్యాణ్ మరోసారి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications