పవన్ కళ్యాణ్.. ఇక సినిమాలపై, 16 వరకు ఫ్యామిలీతో
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇక సినిమాల పైన దృష్టి సారించనున్నారట. గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ తరఫున జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీకి ముందు తెలంగాణ ప్రాంతంలో, ఆ తర్వాత సీమాంధ్రలో ఆయన టిడిపి, బిజెపి కూటమి అభ్యర్థులకు మద్దతుగా సుడిగాలి పర్యటన చేశారు.
దీంతో ఆయన సినిమాలు ఇటీవలి వరకు ఆగిపోయాయి. ఇరు ప్రాంతాల్లో పోలింగ్ ముగియడంతో ఆయన ఇక సినిమాల పైన దృష్టి సారిస్తున్నారట.

ప్రచారం ప్రారంభించడానికి ముందే పవన్ కళ్యాణ్ రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాలను ఇప్పుడు ఆయన పూర్తి చేసే విషయంపై దృష్టి సారించనున్నారు. హిందీ చిత్రం ఓ మై గాడ్ రీమేక్ మే 26వ తేదీ నుండి షూటింగ్ జరుపుకోనుందట. ఇందులో వెంకటేష్‌తో కలిసి పవన్ నటిస్తున్నారు. గబ్బర్ సింగ్ 2లోను పవన్ నటిస్తున్నారు.
తెలంగాణ, సీమాంధ్రలో సుడిగాలి పర్యటన జరిపిన పవన్ కళ్యాణ్ ఒకింత అలసిపోయారనే చెప్పవచ్చు. ఆయన రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టనున్నారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అప్పటి వరకు ఆయన విశ్రాంతి తీసుకుంటారు. ఫలితాల అనంతరం ఆతను సినిమాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారట. అప్పటి వరకు కుటుంబ సభ్యులతో గడపనున్నారట.












Click it and Unblock the Notifications