ఎసి గదుల్లో కూర్చుని ముఖానికి రంగు: పవన్ కళ్యాణ్‌పై జగన్ పార్టీ నేత
కాకినాడ: తెలుగు చలన చిత్ర నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మాదిరిగానే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన గురువారం వ్యాఖ్యానించారు.
అవినీతిపై ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. పరిపాలనను గాలికి వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. కాకినాడలో ధర్నా కార్యక్రమంలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పాల్గొన్నారు.

ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు కూడా కనిపించడం లేదని అన్నారు. కనీసం ప్రశ్నించడానికి కూడా ముందుకు రావడం లేదని విమర్శించారు. ఎసి గదుల్లో కూర్చుని ముఖానికి రంగులు వేసుకుని పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల్లోకి వస్తే సమస్యలు అర్థమవుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత హామీల వల్ల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు పరిచేవరకు ప్రజలు చేపట్టే కార్యక్రమానికి తమ పార్టీ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications