బలవంతంచేస్తే నేనొస్తా: బాబుకి పవన్‌కళ్యాణ్ హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ చట్టం పైన జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు స్పందించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే, ఆ చట్టాన్ని రైతుల పైన రుద్దితే తాను రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.
భూసేకరణ చట్టాన్ని బలవంతంగా రుద్దితే తాను తప్పకుండా రైతుల తరఫున ముందుకు వస్తానని గతంలోనే పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు ఆయన మరోసారి స్పందించారు.
భూసేకరణ పైన రైతులకు నచ్చ చెప్పిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. బలవంతంగా రుద్దితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రైతులకు లాభనష్టాలను ప్రభుత్వం వివరించాలన్నారు. చర్చల ద్వారా సామరస్యంగా దీనిని పరిష్కరించుకోవాలన్నారు.

కాగా, భూసేకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. బలవంతపు భూసేకరణ జరిపితే తాను ప్రజలకు అండగా నిలుస్తానని, బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తానని పవన్ కళ్యాణ్ మార్చిలో రాజధాని ప్రాంతంలో పర్యటించినప్పుడు హామీ ఇచ్చారు.
ఆ హామీని నిలబెట్టుకోవడానికి ఏ విధంగా ముందుకు రావాలనే వ్యూహాన్ని ఆయన వర్గం ఖరారు చేస్తున్టన్లు చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టకూడదని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications