రాజధాని లేకుండా.. బాబు: పవన్‌తో పాటు జూ.ఎన్టీఆర్
హైదరాబాద్/విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. చంద్రబాబు ఆదివారం సాయంత్రం నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా.. గతంలో యువ గర్జన జరిగిన ప్రాంగణంలో ఎపి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. డైబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణానికి జాతీయ స్థాయి ముఖ్యనేతలు హాజరవుతున్నారు.
కొత్తగా ఎపి ముఖ్యమంత్రి అవుతున్న చంద్రబాబు ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఎపి లోటు బడ్జెట్ ఉందని చెబుతూనే కోట్లాది రూపాయలను ప్రమాణ స్వీకారం సందర్భంగా వెచ్చించడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి టిడిపి ధీటుగా స్పందించింది. కొత్త రాష్ట్రం అయినందున అభివృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో జాతీయ నాయకులను ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
కనీసం రాజధాని కూడా లేకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతున్నారని టిడిపి నేతలు గుర్తు చేస్తున్నారు. ఎపి అభివృద్ధికి కేంద్రం నుండి విరివిగా నిధులు రాబట్టాల్సిన అవసరం ఉందని, అలాగే పారిశ్రామికవేత్తలను ఆకర్షించాల్సిన ఆవశ్యకత ఉందని వారు చెబుతున్నారు. అయినా మూడు కోట్ల రూపాయల ఖర్చును జగన్ ముప్పై కోట్లుగా చెబుతున్నారని వారు విమర్శిస్తున్నారు.
ప్రజా ధనాన్ని లూటీ చేసిన జగన్, కోట్లాది రూపాయలతో ఓదార్పు నిర్వహించిన జగన్, జైలు నుండి విడుదలయినప్పుడు నాలుగు గంటల పాటు భారీగా డబ్బులు ఖర్చు పెట్టి ర్యాలీ తీసిన జగన్... ఇప్పుడు తమను ప్రశ్నించడం విడ్డూరమని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ఎపి అభివృద్ధిని కాంక్షించే పని చేస్తున్నారని చెప్పారు.

బాబు ప్రమాణ స్వీకారానికి వీరే...
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. బిజెపి అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సీనియర్ నాయకులు పీయుష్ గోయల్, అనంత కుమార్, కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్, నాలాగాండ్ సిఎం జిలియాంగ్, రాజస్థాన్ సిఎం వసుందరా రాజే, గుజరాత్ సిఎం ఆనందీ బెన్ పటేల్, గోవా సిఎం మనోహర్ పారికర్, అకాళీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తదితరులు హాజరు కానున్నారు.
కుటుంబ సభ్యులు
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నందమూరి, నారా కుటుంబ సభ్యులు రానున్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు కూడా రానున్నారు. నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్‌లు నిమ్మకూరు సందర్శిస్తారు. హరికృష్ణ, కళ్యాణ్ రాం, జూనియర్ ఎన్టీఆర్‌లు నిమ్మకూరులో స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించి.. ఆ తర్వాత ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు.
చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరుతారు.
ఆహ్వానం ఉన్నా....
తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు ముఖ్య నాయకులకు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఆయితే పలు కారణాల వల్ల కొందరు హాజరు కావడం లేదు. బిజీగా ఉన్నందువల్ల మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావులు హాజరు కావడం లేదు. ప్రమాణ స్వీకారానికి భారీగా ఖర్చు పెడుతున్నారని, అలాంటి ప్రమాణ స్వీకారానికి తాను హాజరుకానని జగన్ చెబితే, ఇబ్బంది తలెత్తుతుందని తాను వెళ్లడం లేదని ఎపిసిసి అధ్యక్షులు రఘువీరా చెప్పారు.












Click it and Unblock the Notifications