పిఠాపురంలో 9 నెలల్లో రూ. 100 కోట్ల అభివృద్ధి.. ఇక పవన్ అడ్డాగా పిఠాపురం..?
గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 175 స్థానాలకు గానూ.. 164 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో తిరుగులేని మెజారిటీతో టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. జూన్ 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక పిఠాపురంలో పవన్ కల్యాణ్ రికార్డు విజయం సాధించారు. ఏకంగా 51 వేల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కల్యాణ్ పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తానని మాటిచ్చారు. అన్న మాటకు కట్టుబడి ఇవాళ పిఠాపురంలో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు.
రూ.34 కోట్ల అంచనా వ్యయంతో పిఠాపురంలో ఈ ఆస్పత్రిని నిర్మించనున్నారు. ఈ ఆస్పత్రిలో రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వార్డు, డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అధునాతన మెషీన్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రి నిర్మాణం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని 3 లక్షల మంది ప్రజలతోపాటు ఆరు పరిసర మండలాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందే అవకాశం ఉంటుందని సమాచారం.
ఆస్పత్రి శంకుస్థాపన అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడారు. 'కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల కాలంలోనే నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు. ప్రస్తుతం ఈ ఆస్పత్రి 30 పడకల నుంచి 100 పడకలుగా ఆధునీకరణ జరుగుతుందన్నారు. నూతనంగా డెర్మటాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, పాథాలజీ, ENT డిపార్టుమెంట్లు ఏర్పాటు అవుతాయని వివరించారు.

అంతేకాక పిఠాపురం పరిధిలోని చేబ్రోలు గ్రామంలో టీటీడీ కళ్యాణమండపం, రామాలయంలో రథశాల నిర్మాణ పనులకు కూడా పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ తో పాటు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications