నాగబాబు మంత్రి కావట్లేదా? పవన్ తాజా ప్లాన్ ఇదే..!
ఏపీలో కూటమిలో కీలకమైన జనసేన పార్టీలో కీలక నేత అయిన నాగబాబుకు దక్కే పదవిపై ఆరునెలలుగా చర్చ జరుగుతూనే ఉంది. గత ఎన్నికల్లో కూటమి కోసం ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేసిన నాగబాబుకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ పదవి ఇవ్వాలనే విషయంలో చంద్రబాబు మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. అయితే చివరికి పలు దఫాల చర్చల తర్వాత నాగబాబును ఏపీ కేబినెట్లోకి తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతే కాదు దీన్ని బహిరంగంగా కూడా ప్రకటించేశారు.
అయితే ఇప్పుడు ఆ నిర్ణయం కూడా మార్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి కాకుండా మరో పదవి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే నాగబాబు తాను కోరుకున్న విధంగా ఎంపీ కాబోతున్నారు. దీని వల్ల పలు ప్రయోజనాలు ఉన్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్ధానంలోకి నాగబాబును పంపే అవకాశాలు ఉన్నాయి.

నాగబాబును ఏపీ కేబినెట్లో తీసుకోవడం పవన్ కళ్యాణ్ కూ, చంద్రబాబుకూ సులువే. కానీ నాగబాబును తీసుకోవడం వల్లే ఒకే కేబినెట్లో ఇద్దరు అన్నదమ్ములతో పాటు జనసేనకు ఉన్న మంత్రుల్లో ఇద్దరు ఒకే కుటుంబ సభ్యులు కూడా అవుతారు. అది టీడీపీ వంటి పార్టీల్లో అయితే ఇబ్బంది లేదు కానీ జనసేనకు ఉన్న తక్కువ ప్రాతినిధ్యంలో పవన్ కుటుంబం నుంచే ఇద్దరు ఉండే విమర్శలు తప్పవు. ఇప్పటికే చంద్రబాబు మంత్రి పదవి ప్రకటన తర్వాత నాగబాబు, పవన్ పై ఇవే విమర్శలు వచ్చాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా కూటమి గెలుపు కోసం పనిచేసిన నాగబాబుకు మంత్రి పదవి ఇద్దామనుకున్నారు.
అయితే తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అనూహ్యంగా రాజీనామా చేయడంతో దాదాపు మూడున్నరేళ్ల పదవీకాలం ఉన్న రాజ్యస సీటు ఖాళీ అయింది. దీనికి ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో కూటమి నేతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇందులో నాగబాబును పంపితే బెటర్ అన్న చర్చ కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ముందు నుంచీ నాగబాబు కోరుకుంటోంది ఎంపీ పదవే. అలాగే కేబినెట్లోకి కాకుండా ఎంపీగా నాగబాబును పంపడం వల్ల ఒకే కేబినెట్లో ఇద్దరు కుటుంబ సభ్యుల విమర్శలకూ చెక్ పెట్టవచ్చు. అలాగే రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం దక్కినట్లవుతుంది. దీంతో ఈ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.












Click it and Unblock the Notifications