Pawan Kalyan : టీడీపీతో పొత్తు- పవన్ కు అసలు సవాల్ అక్కడే ? తేడా వస్తే వైసీపీకి వరమే !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకూ పొత్తుపై మాట్లాడకుండా కలిసి పనిచేద్దామని మాత్రమే చెబుతూ వచ్చిన పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇప్పుడు కలిసి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనకు బలమైన మద్దతుదారుగా మారిన పవన్..ఇప్పుడు వైసీపీపై పోరులో భాగంగా టీడీపీతో కలిసే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని తేల్చిచెప్పేశారు. దీంతో పవన్ నిర్ణయం తర్వాత పరిస్ధితులు ఎలా మారబోతున్నాయనే ఆసక్తి పెరుగుతోంది.
పవన్ కళ్యాణ్ ఏనాటికైనా సీఎం అవుతారని ఆశగా ఎదురుచూస్తున్న ఆయన అభిమానులు, కాపు సామాజిక వర్గ ప్రజలు ఓవైపు.. మరోవైపు అధికారం కావాలంటే ఓ అడుగు వెనక్కి తగ్గక పరిస్ధితుల్లో ఉన్న చంద్రబాబు, టీడీపీ. అదే సమయంలో జరిగిన చంద్రబాబు అరెస్టు ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాల్ని ఓ రేంజ్ లో వేడెక్కించేసింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తుపై చేసిన ప్రకటన తర్వాత కాపు సామాజిక వర్గం రియాక్షన్ ఏంటనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి మౌనంగా కనిపిస్తున్న కాపు సామాజిక వర్గం లోలోపల ఏమనుకుంటోంది, పవన్ నిర్ణయానికి కాపుల మద్దతు ఎంత అనే చర్చ జరుగుతోంది.

పవన్ కు అధికారం దక్కాలంటే చంద్రబాబుతో పొత్తు తప్పనిసరి అని భావనను ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీలోనూ నరనరాన నింపడంలో ఆయన సక్సెస్ అయ్యారు. టీడీపీతో పొత్తు తప్పదని పవన్ ఎప్పుడో చెప్పేశారు. అలాగే కాపు సామాజిక వర్గం తనకు అండగా నిలవలేదని పలుమార్లు బహిరంగసభల్లోనే అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కాపులు తనను సీఎం కావాలనుకుంటే తప్పనిసరిగా తన నిర్ణయాలకు అండగా నిలవాల్సిందేనన్న వాతావరణాన్ని పవన్ క్రియేట్ చేసేశారు. అనంతరం వ్యూహాత్మకంగా టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు.
ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం గతంలోలా చంద్రబాబుపై వ్యతిరేకతను కొనసాగిస్తుందా లేక పవన్ కు అధికారం కావాలి కాబట్టి ఓ అడుగు వెనక్కి తగ్గుతుందా అన్న చర్చ జరుగుతోంది. అలాగే కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కు పూర్తి మద్దతు లభిస్తుందా లేక ఎప్పటిలాగే పార్టీల మధ్య కాపులు చీలిపోతారా అన్నది చూడాల్సి ఉంది. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తమ కుల నాయకుడు సీఎం అవుతాడనే భావనలో తొలిసారి కాపులు ఐక్యత ప్రదర్శించారు. దీంతో టీడీపీ నష్టపోయింది. కాంగ్రెస్ కూడా కాపు ఓటు బ్యాంకును నష్టపోయింది. ఈసారి అదే కాపులు మరోసారి ఆయన సోదరుడు పవన్ కు అండగా నిలవాలని నిర్ణయించుకుంది. కానీ పవన్ చంద్రబాబుకు జై కొట్టడంతో కాపులు కొత్త దారులు వెతుక్కునే పరిస్థితి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అదే సమయంలో జనసేన కార్యకర్తలు కూడా డైలామాలో పడ్డారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు-లోకేష్ అవినీతి పరులని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. బాలకృష్ణ జనసేన కార్యకర్తల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. రెండు జెండాలను మోసేందుకు సిద్ధంగా తాము లేమని తమ దారులు తాము వెతుక్కుంటున్నట్లు సమాచారం. నాడు లోకేష్ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డప్పుడు టీడీపీ వారితో సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధమే చేశామని పవన్ అభిమానులు చెబుతున్నారు. మరి నాడు లోకేష్ చంద్రబాబులను అవినీతి పరులుగా ముద్రవేసిన పవన్ కళ్యాణ్ నేడు ఏ రకంగా వారిని సమర్థిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి పవన్ టీడీపీ పొత్తు ప్రకటనతో కాపులు మరోసారి ఆలోచనలో పడ్డారు. పవన్ కళ్యాణ్‌లో స్థిరత్వం లేదని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక మళ్లీ కాపులు చీలిపోతే మాత్రం వైసీపీ మరోసారి ఆ ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications