'పవన్ కళ్యాణ్! రాజకీయాల్లో సినిమా ట్రిక్స్ వద్దు'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అక్కినేని నాగార్జునలు ఇటీవల గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని కలిసిన విషయం తెలిసిందే. త్వరలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తదితరులు కూడా కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై కాంగ్రెసు విమర్శలు చేస్తోంది.
కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు పవన్ మూడు పెళ్లిళ్ల పైన ప్రశ్నలు గుప్పించిన విషయం తెలిసిందే. రఘువీరా రెడ్డి వంటి నేతలు కూడా జనసేన పార్టీ ప్రభావం తమ పైన ఉండదని చెబుతున్నారు. తాజాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్ నాగార్జున, పవన్ కళ్యాణ్‌లను హెచ్చరించారు. సినిమాలలోని ట్రిక్స్‌ను వారు రాజకీయాల్లో ఉపయోగించాలని చూడవద్దని హెచ్చరించారు.
మోడీ పాలనలోని గుజరాత్ పాలనపై ప్రశంసలు చేసిన నాగార్జునపై పొన్నం విరుచుకుపడ్డారు. గుజరాత్ పల్లెలు అందంగా ఉన్నాయని అంటున్న నాగార్జున బంజారాహిల్స్‌లోని ఫిల్మ్ నగర్ దాటి వచ్చి మన రాష్ట్ర పల్లెలు చూశారా అని ఆయన అడిగారు. నాగార్జునను నటుడిగా గౌరవిస్తామని, అయితే సినిమా రాజకీయాలు చేస్తే మాత్రం జాగ్రత్త అని ఆయన అన్నారు. హోటల్‌లో పుట్టిన పార్టీ అక్కడే మునిగిపోతుందని ఆయన కరీంనగర్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు.












Click it and Unblock the Notifications