బండి సంజయ్ పై పవన్ గుస్సా వెనుక - ఏం జరుగుతోంది..!?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మిత్రుడు పట్టటం లేదా. తాజాగా ఢిల్లీ వెళ్లి మిత్రపక్ష నేతలను కలిసి వచ్చారు. వారితో రాజకీయ అంశాలను చర్చించారు. కొత్త ప్రతిపాదనలను వారి ముందుంచారు. వైసీపీ విముక్త ఏపీ..వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పని చేస్తానని ఢిల్లీలోనూ స్పష్టం చేసారు.
ఢిల్లీ బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న తనకు ఏపీ బీజేపీ నేతల నుంచి మాత్రం సహకారం అందటం లేదని గతంలోనే పవన్ స్పష్టం చేసారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కు తెలంగాణ బీజేపీ నేతల కష్టాలపై స్పందించటం లేదు. దీని వెనుక కారణం ఏంటి.

వచ్చే ఎన్నికల్లో ఏపీతో పాటుగా తెలంగాణలోనూ పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతానికి పవన్ ఇంకా బీజేపీతో పొత్తులో ఉన్నారు. కానీ, తెలంగాణ బీజేపీ నేతలతో మాత్రం తొలి నుంచి సఖ్యత లేదు. తెలంగాణలో బీజేపీ నేతల తీరు కారణంగానే తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్దికి మద్దతు ఇస్తున్నట్లుగా గతంలో పవన్ ప్రకటించారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనూ జనసేన పోటీ చేయద్దని బీజేపీ నేతలు కోరగానే పవన్ అంగీకరించారు. ఇప్పటికీ తెలంగాణ బీజేపీ నేతలతో పవన్ సంబంధాలు మెరుగుడ లేదు. తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో, పవన్ బీజేపీతో పొత్తుతో ఉన్నా..ఆ పార్టీ నతేలతో మాత్రం దూరంగానే ఉంటున్నారు.
తాజాగా పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ అంశంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం బండి సంజయ్ పైన కేసు నమోదు చేయటాన్ని బీజేపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. కేసుల నమోదును ఖండించింది. కానీ, మిత్రపక్షంగా ఉన్న జనసేనాని మాత్రం ఈ విషయంలో అసలు స్పందించ లేదు.
ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే పవన్ కల్యాణ్ వరంగల్ లో ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీలో ఇంకా అధికారికంగా పొత్తు ఖరారు కాకపోయినా..టీడీపీ అండ్ చంద్రబాబు వ్యవహారాల్లో పవన్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు. కానీ, తెలంగాణలో ఏం జరిగినా మాత్రం పవన్ స్పందించకపోవటం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది.
పవన్ తన ఢిల్లీ పర్యటనలో టీడీపీ - జనసేన - బీజేపీ కలిసి 2014 తరహాలో పోటీ చేయాలనే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. దీని పైన బీజేపీ నాయకత్వం స్పష్టత ఇవ్వలేదని సమాచారం. కర్ణాటక ఎన్నికల తరువాత తెలుగు రాష్ట్రాల్లో వ్యవహారాల పైన నిర్ణయాలు తీసుకుందామని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ తన ప్రతిపాదనకు అంగీకరిస్తే మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలనేది పవన్ వ్యూహంగా కనిపిస్తోంది.
బీజేపీ అంగీకరించకపోతే పవన్ ఇక టీడీపీతో వెళ్లే విధంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలతో పాటుగా ఏపీ బీజేపీ నేతలతోనూ పవన్ కు క్రమేణా సంబంధాలు దూరం అవుతున్నాయి. దీంతో..పవన్ రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications