కాపులను నిరాశపరిచిన పవన్ కల్యాణ్: ఎత్తుగడ ఏమిటి?
హైదరాబాద్: కాపు నేత ముద్రగడ పద్మానాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా తునిలో చెలరేగిన హింస నేపథ్యంలో సినిమా షూటింగ్ రద్దు చేసుకుని కేరళ నుంచి హుటాహుటిన హైదరాబాద్ వచ్చి మర్నాడు మీడియా సమావేశంలో తన భావాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంచుకున్నారు.
Photos: ముద్రగడ & తుని దృశ్యాలు
కానీ, ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా వ్యవహరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపులను, ఆ సామాజిక వర్గానికి చెందిన యువతను పవన్ కల్యాణ్ నిరాశపరిచారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలా అని అడిగితే తాను ఒక కులం కోసం మాట్లాడే వ్యక్తిని కాదని సమాధానం దాట వేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తప్పు పడుతున్నట్లు కనిపిస్తూనే ఆయన పరోక్షంగా బలపరిచారని అంటున్నారు. దీంతో కాపు సామాజిక వర్గం ఆయనపై అసంతృప్తితో ఉంది. అయితే, దీనికి కారణం లేకపోలేదని అంటున్నారు.

అన్నయ్య చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఓడిపోయిన అనుభవం పవన్ కల్యాణ్‌ను అలా అనేట్లు చేసిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ప్రజారాజ్యంపై కాపు సామాజిక వర్గానికి చెందిన పార్టీగా ముద్ర పడిందని, ఇతర సామాజిక వర్గాలు దాన్ని సొంతం చేసుకోలేకపోయారని, దానివల్లనే ఓడిపోయామని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.
పవన్ కల్యాణ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు వేటికీ సూటిగా సమాధానం ఇవ్వలేదు. వాటిని దాటవేసే ప్రయత్నమే చేశారు. ఇచ్చిన హామీని అమలు చేయలేదు కాబట్టి కాపులు ఉద్యమించారని అంటూ చేస్తే చేస్తామని చెప్పాలి, లేదంటే కాదని చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఆ హామీ ఇచ్చారు కాబట్టి సమాధానం చెప్పాల్సి ఉంటుందనేది ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది.
మొత్తం మీద, తాను ఏదో ఒక సామాజిక వర్గానికి చెందినవాడిని కాదని, అందరికీ చెందినవాడినని చెప్పుకుని అన్ని వర్గాల మద్దతు పొందడానికి పవన్ కల్యాణ్ ఆ విధంగా వ్యవహరిస్తున్నారని అటున్నారు.












Click it and Unblock the Notifications