ఇకనైనా మారండి, సంతోషం: కెసిఆర్, జగన్‌లకు పవన్
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎన్నికల ఫలితాల పైన శుక్రవారం స్పందించారు. అందరికీ తన హృదయ పూర్వక నమస్కారాలు అంటూ మాట్లాడారు. పదేళ్ల కాంగ్రెసు, వైయస్ రాజశేఖర రెడ్డి పాలనలో ప్రజలు విసిగిపోయారని, అలా విసిగి పోయిన వారిలో తాను కూడా ఉన్నానని చెప్పారు. వైయస్ దోపిడీ విధానం, తెలంగాణలో విధ్వంసం చేసిన విధానం తనను బాధించిందన్నారు. దోపిడీతో అసహనానికి గురైన ప్రజలు టిడిపిని గెలిపించారన్నారు.
కాంగ్రెసు పార్టీ వ్యతిరేక ఓట్లు చీల్చవద్దనే తాను పోటీ చేయలేదని చెప్పారు. తనకు జగన్ పార్టీ పైన వ్యక్తిగత కోపమేమీ లేదన్నారు. అయితే వారి దోపిడీ చూస్తే చాలా బాధేసిందన్నారు. దోపీడీకి పాల్పడ్డ వారు ఇప్పటికైనా మారాని హితవు పలికారు. వైయస్ దోపిడీ విధానాన్ని తనతో పాటు చాలామందిని బాధించిందన్నారు. టిడిపి, బిజెపి విజయం తనకు సంతోషాన్నిచ్చిందని చెప్పారు. టిడిపి, బిజెపి కూటమిని గెలిపించినందుకు ప్రజలందరికీ థ్యాంక్స్ అన్నారు.

తెలంగాణలో గెలుపొందిన తెరాసకు అభినందనలు అన్నారు. ఇప్పటికైనా కెసిఆర్ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం తెరాస వల్ల ప్రజలు ముఖ్యంగా సీమాంధ్ర ప్రజలు ఇబ్బందులకు గురయ్యారన్నారు. తాము భరించామని, రాష్ట్రం విడిపోయాక ఇక సీమాంధ్రులను కించపర్చే మాటలు మానుకోవాలన్నారు. సెటిలర్స్ అనే పదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు.
గెలిచిన చంద్రబాబు, మోడీ, కెసిఆర్‌లకు అభినందనలు అన్నారు. సీమాంధ్రలో టిడిపి గెలుపు, తెలంగాణలో ప్రతిపక్షంలో ఉండటం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. కాంగ్రెసు అధినేత్రి దోపిడీకి అండగా నిలబడ్డారన్నారు. వారికి అనుకూలంగా ఉంటే బాగుంటారని, వారికి వ్యతిరేకంగా ఉంటే ఏమైనా చేస్తారన్నారు. అందుకే కాంగ్రెసు పార్టీ దేశంలో, రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం ముక్కలు కావడానికి వైయస్ దోపిడీ పాలనే కారణమన్నారు.
వైయస్ హయాంలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారని, ఇక ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తారనే బాధ తనలో ఉండేదన్నారు. అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. ఈ ఎన్నికల ఫలితాలు తారుమారైనా తాను సాయుధ పోరాటం చేసే వాడినన్నారు. బాబు నాయకత్వంలో సీమాంధ్ర, మోడీ నాయకత్వంలో భారత్ అభివృద్ధఇ చెందుతుందన్నారు.
టిడిపి, బిజెపి గెలుపు ఆనందాన్నిచ్చిందన్నారు. దోచుకొని ప్రజలలోకి వెళ్లలేమని, ఇప్పటికైనా వారు తెలుసుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇప్పటికైనా మారాలన్నారు. ప్రజలు తమ ఓటు ద్వారా అవినీతిపరులను తిప్పి కొట్టార్నారు. తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని చెప్పారు. తాను చంద్రబాబుతో ఉదయం మాట్లాడానని, మోడీ కార్యాలయం నుండి సందేశం వచ్చిందని చెప్పారు. అదిలాబాదులో నీటి ఎద్దడి ఉంటుందని, తెలంగాణలో ప్రజల సమస్యల పైన దృష్టి సారిస్తామన్నారు.












Click it and Unblock the Notifications