అవాంఛనీయం: ప్రధాని మోడీకి సెక్యూరిటీ వైఫల్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్పందన
హైదరాబాద్/అమరావతి: పంజాబ్ రాష్ట్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఎదురైన సంఘటనను దురదృష్ణకరంగా భావిస్తున్నట్లు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ ప్రధాని ప్రయాణంలో 20 నిమిషాలపాటు ముందుకు వెళ్లలేక రోడ్డుపైనే ఆయన కారు నిలిచిపోయే పరిస్థితి అవాంఛనీయమన్నారు పవన్ కళ్యాణ్.

నిరసనలు ఇలా ఉండకూడదు: ప్రధానికి సెక్యూరిటీపై పవన్
ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కే అయినప్పటికీ ప్రధాని భద్రతకు ఇబ్బంది కలిగేలా ఆ నిరసన ఉండరాదని భావిస్తున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రధాన మంత్రి గౌరవానికి భంగకరంగా ఏ పార్టీ ప్రభుత్వమైనా, ఎటువంటి వ్యక్తులైనా ప్రవర్తించరాదు. ప్రధాన మంత్రిని గౌరవించడం అంటే మన జాతిని, మన దేశాన్ని గౌరవించడమేనని వ్యాఖ్యానించారు.

ఇలాంటి పరిస్థితి ఎదురుకావొద్దు: పవన్ కళ్యాణ్
‘ఈ దుస్సంఘటన కావాలని చేసినట్లు నేను భావించడం లేదు. అయితే ప్రధాన మంత్రి ఇతర రాష్ట్రాలలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్‌ను తు.చ. తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాలపైనే ఉంటుంది. ఇది సర్వవిదితమే. మరోసారి ప్రధానమంత్రికి గానీ, అత్యంత బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నాను. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన నరేంద్ర మోడీకి గౌరవపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను' అని పవన్ కళ్యాణ్ తెలిపారు. పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీ కాన్వాయ్.. రైతు నిరసనలతో ఫ్లైవర్‌పైనే 20 నిమిషాలపాటు నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయారు.

9వ తేదీన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశం...
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ నేతృత్వంలో జనవరి 9వ తేదీన మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశం జరుగుతుంది. ఉదయం 11గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, రైతుల సమస్యలు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర అంశాలను చర్చిస్తారు. జనసేన పార్టీ కార్యక్రమాలను సమీక్షిస్తారు. ఇప్పటికే పలు జిల్లాల్లో మండల అధ్యక్షులను నియమించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేస్తారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పిఏసి. సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లు పాల్గొంటారు
Recommended Video

ఉత్తరాంధ్రలో జనసేన సంస్థాగత నిర్మాణానికి త్రిసభ్య కమిటీ
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో జనసేనను బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చర్యలు చేపట్టారు. ముందుగా పార్టీలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ తర్వాత విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీలోని ముగ్గురు సీనియర్ నాయకులతో ఒక త్రిసభ్య కమిటీ ని నియమించారు. ఈ కమిటీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హన్ ఖాన్, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్ సభ్యులుగా ఉంటారు. తొలుత జిల్లా కమిటీలు, ఆ తర్వాత మండల, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తయ్యేవిధంగా ఈ కమిటీ చర్యలు చేపడుతుంది. పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు ఈ త్రిసభ్య కమిటీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది.












Click it and Unblock the Notifications